మిజోరంలో బ్రూ ఓటర్లకు ఊరట

ఓటేసేందుకు అనుమతించిన ఇసి

ఐజ్వాల్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): త్రిపురలో శరణార్థి శిబిరాల్లో ఉంటున్న బ్రూ ఓటర్లు మిజోరంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విషయం తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. 11,232 మంది బ్రూ ఓటర్లు తమ ఓటు వేసే విషయంపై చెలరేగిన వివాదం కారణంగా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌బీ శశాంక్‌ను కూడా ఆ పదవి నుంచి తప్పించారు. కాగా, వారు ఓట్లు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మిజోరంలోని మమిత్‌ జిల్లా కాన్హ్‌మున్‌ గ్రామంలో వారు ఓట్లు వేయడానికి

ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర ఎన్నిక అధికారి ఒకరు విూడియాతో మాట్లాడుతూ… ‘బ్రూలు ఓటు వేసేందుకు మిజోరంలోని కాన్హ్‌మున్‌లో అన్ని ఏర్పాట్లు చేయాలని మాకు ఈసీ నుంచి ఆదేశాలు అందాయి. ఆ పనిని మేము ప్రారంభించాం’ అని తెలిపారు. ఈ విషయంపై మిజోరం ఎన్నికల ప్రధానాధికారి ఆశిష్‌ కుంద్రాకు రెండు రోజుల్లో రాతపూర్వకంగా ఆదేశాలు అందుతాయని ఎన్నికల అధికారి ఒకరు చెప్పారు. బ్రూ ఓటర్లు మమిత్‌ జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. ఈ జిల్లాలో హచ్చెక్‌, దంపా, మమిత్‌ నిజయోక వర్గాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 14 శాతం మంది ఓటర్లు బ్రూలే. కాన్హ్‌మున్‌ గ్రామం త్రిపుర, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. బ్రూ శరణార్థులు ఆ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం ఆరు శరణార్థి శిబిరాల్లో ఉంటున్నారు. కోలాసిబ్‌ జిల్లాలోని టుయిరియల్‌, కోలాసిబ్‌ నియోజక వర్గాల నుంచి గానూ ఓట్లు వేసే వారిలో బ్రూలు 3.5 శాతం మంది ఉన్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 7,68,181 మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు 28న మిజోరం శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి.’మూడేళ్లుగా రాష్ట్రంలోని ఓటర్ల పునఃసవిూక్ష జరగలేదు. ఇటీవల జరిపాము. మొత్తం 9 శాసనసభ నియోజక వర్గాల నుంచి బ్రూ శరణార్థులు ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించాం. అందుకోసం ఆ గ్రామంలో వేర్వేరు ఈవీఎం యంత్రాలను ఏర్పాటు చేస్తాం. ఈ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు త్రిపుర సర్కారు నుంచి కూడా సాయం తీసుకుంటాం’ అని ఆయన వివరించారు.