మిజోరం సీఈవోగా ఆశిష్‌ కుంద్రా

 

– శశాంక్‌పై వేటు వేసిన ఈసీ

న్యూఢిల్లీ, నవంబర్‌15(జ‌నంసాక్షి) : మిజోరం సీఈవోగా ఆశిష్‌ కుంద్రాను నియమిస్తూ గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) ఎస్‌బీ శశాంక్‌ను తన పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఐఏఎస్‌ అధికారి ఆశిష్‌ కుంద్రాను నూతన ఎన్నికల అధికారిగా నియమించారు. మిజోరం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ రాష్ట్ర కొత్త సీఈవోగా ఆశిష్‌ కుంద్రాను నియమిస్తున్నామని, ఆశిష్‌ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ పేర్కొంది. త్రిపురలో శరణార్థి శిబిరాల్లో ఉన్న బ్రూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎస్‌బీ శశాంక్‌ అనుమతినిచ్చారు. అయితే శశాంక్‌ నిర్ణయాన్ని రాష్ట్ర ¬ంశాఖ కార్యదర్శి లాల్నున్‌మయవా చువాంగో వ్యతిరేకించారు. దీంతో చువాంగోపై శశాంక్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల పక్రియలో చువాంగ్‌ జోక్యం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో చువాంగోపై ఈసీ వేటు వేసింది. దీంతో రాష్ట్రంలోని పౌరసంఘాలు, విద్యార్థి సంఘాలు శశాంక్‌పై ధ్వజమెత్తాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. అటు ప్రభుత్వం కూడా శశాంక్‌ను తప్పించేందుకు అంగీకరించడంతో ఈసీ శశాంక్‌పై వేటు వేసింది.