ముంబయి దాడుల సూత్రదారులను

కఠినంగా శిక్షించాలి
కేంద్ర మంత్రి ఎస్‌ఎంకృష్ణ
టోక్యో: భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌ పై సదస్సు సందర్భంగా ఆయన ఆదివారం జపాన్‌ రాజధాని టోక్యోలో పాక్‌ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌తో దాదాపు 30 నిమిషాలపాటు సమావేశమయ్యారు. పలు కీలక అంశాల పై చర్చించారు. ముంబాయి దాడుల్లో పాక్‌ ఉగ్రవాదల ప్రమేయం పై తాము ఇప్పటికే బలమైన సాక్ష్యాధారాలను సమర్పించాలని ఎస్‌.ఎం.కృష్ణా గుర్తు చేశారు. ఇక వారిని చట్టం ముందు నిలబెట్టి, శిక్షించాల్సిన భాధ్యత పాక్‌ సర్కార్‌ పై ఉందన్నారు. భారత్‌ పై విషం చిమ్ముతున్న లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ వ్యవహారాన్ని హీనా రబ్బానీ ఖర్‌ దృష్టి తీసుకోచ్చారు. పాకిస్థాన్‌ జైళ్లలో మగ్గుతున్న సరబ్‌జిత్‌సింగ్‌ తో పాటు ఇతర భారతీయ ఖేదీలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భారత్‌- పాక్‌ మధ్య సాధారణ సంబంధాలు నెలకొనేందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలని సూచించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు తమ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ ఎంతగానో తపించారని, ఆయన ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని హీనా రబ్బానీ ఖర్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

తాజావార్తలు