ముంబై చేరుకున్న రైతుల యాత్ర

సిఎం ఫడ్నవీస్‌తో చర్చించేందుకు యత్నాలు

ముంబయి,నవంబర్‌22(జ‌నంసాక్షి): గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలు అమలు చేయాలని కోరుతూ వేలాదిమంది రైతులు, గిరిజనులు బుధవారం ప్రరాంభించిన నిరసన యాత్ర ముంబయి శివారుకు చేరుకుంది. థానే నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. వీరంతా గురువారం ఉదయానికి స్థానిక బైకుల్లా బ్రిగేడ్‌ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం షెడ్యూల్‌ ప్రకారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశ మవనున్నట్లు లోక్‌ సంఘర్ష్‌ మోర్చా నేత ప్రతిభా షిండే పేర్కొన్నారు. వాగ్దానాలలో రెండు శాతం కూడా నెరవేర్చలేదని ఆమె తెలిపారు. ముంబయిలోని ఆజాద్‌ మైదానానికి చేరుకుని బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో రైతులు ఆందోళన నిర్వహించడం ఇది రెండవసారి. మార్చిలో 25వేలమంది రైతాంగం ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ బ్యానర్‌లో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ సంక్షోభం, ప్రకృతి విపత్తులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు 2017లో సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటించిన విధంగా రుణమాఫీ, రైతులను ఆదుకునేందుకు ప్యాకేజీ, ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని, రైతు కార్మికులకు పరిహారం అందజేయాలని వారు డిమాండు చేస్తున్నారు.