ముషిడిపిల్లి పథకం పడకేస్తే నోరెండాల్సిందే

విజయనగరం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): విజయనగరం నగరపాలిక పరిధిలో మంచినీటి సరఫరా తీరు ఆందోళకు గురిచేస్తోంది. ముషిడిపల్లి పథకం మొరాయించడంతో విజయనగరం పట్టణం దాహంతో అల్లాడుతోంది. ముషిడిపల్లి పథకం నుంచి కొత్తఅగ్రహారం, కంటోన్మెంట్‌, బాలాజీనగర్‌ల్లో ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు నిత్యం నీరొస్తుంది. రోజు విడిచి రోజు వచ్చే కుళాయిలు సరిగా నీటిని అందించడం లేదు. దీనికి ప్రధాన జలవనరుగా ఉన్న ముషిడిపిల్లి పథకం వద్ద ఉన్న ఊటబావులన్నీ ఎండుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. గోస్తనీ నదిలోని ముషిడిపల్లి పథకం వూటబావులన్నీ పూర్తిగా ఎండిపోవడంతో పంపింగ్‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే పరిస్తితి దారుణంగా ఉంటే మార్చి, ఏప్రిల్‌, మే నెల వస్తే పరిస్తితి ఏంటన్న ఆందోళన నెలకొంది. సౌకొద్దిరోజుల్లోనే గోస్తనీలో ముషిడిపల్లి పథక వూటబావులన్నీ ఎండి పోయాయంటే వాటి సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.  ఏళ్ల క్రితమే రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించుకుని ప్రతీ వీధిలో, ప్రధాన కూడళ్లలోనూ కుళాయిలు ఏర్పాటుచేసుకున్న ఘన చరిత్ర విజయనగరానిది. నెల్లిమర్లలో చంపావతి నది వద్ద నిర్మించిన రక్షిత నీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీరు సరిపోవడం లేదని ముషిడిపల్లి నీటి పథకాన్ని తీసుకొచ్చారు. రోజురోజుకీ పెరుగుతోన్న జనాభా అవసరాల దృష్ట్యా తాగునీటి వనరుల్ని పెంపొందించుకోవడంలో మున్సిపల్‌ పాలకవర్గాలు చతికిలపడ్డాయి. అమృత్‌ పథకం ద్వారా రామతీర్థం, నెల్లిమర్ల పథకాల్ని మరింత పటిష్ఠం చేసి మరో 10 ఎంఎల్‌డీ నీటిని అందించడానికి సిద్ధమవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.