మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం: సిఐటియు డిమాండ్
శ్రీకాకుళం,అక్టోబర్13(జనంసాక్షి): తిత్లీ తుఫాన్‌లో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు డిమాండ్ చేశారు. ఉద్ధాన ప్రాంతం మందస మండలంలో సిఐటియు ప్రతినిధి బృందం శనివారం పర్యటించింది. మందస గ్రామం, బైరిసారంగపురం, గ్రామంలో విద్యుత్, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ప్రత్యక్షంగా చూసిన సిఐటియు బృందం వెంటనే స్పందించి సిఐటియు ఆధ్వర్యంలో రూ.10 వేలు ఆర్థిక సాయంతో జనరేటర్ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించింది. అనంతరం సిఐటియు బృందం మందస చాకలి వీధిలో సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతున్న సహాయ శిబిరాన్ని సందర్శించారు. 500 కేజీలు బియ్యాన్ని సిఐటియు తరుపున అందించారు. తుఫాన్‌కు దెబ్బతిన్న ఇల్లును, వరి పొలాలును, కొబ్బరి, జీడీ తోటలను పరిశీలించారు. తరువాత సిఐటియు బృందం మాట్లాడుతూ.. ప్రజలు విద్యుత్, మంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే తాగు నీరు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలకు గ్రామాల్లో సహాయ, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని విమర్శించారు. తాగు నీటికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దెబ్బ తిన్న వరిపంటకు ఎకరాకు రూ. 25 వేలు, జీడీ, కొబ్బరి చెట్టు ఒక్కింటికి రూ.15 వేలు చొప్పున నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని కోరారు. తుఫాన్ కు దెబ్బ తిన్న ఇల్లుకు ప్రభుత్వం ఐఎవై పథకం కింద ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వం తాగునీరు సరఫరా చేయాలని, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చేయాలని, ప్రత్యేక వైద్య బృందాలను పంపించి అంటు వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతినిధి బృందంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా నాయకులు పి.తేజేశ్వరరావు, ఎన్.వెంకటరమణ, అల్లు.సత్యనారాయణ, ఎన్.గణపతి, శ్యాం పిస్టన్స్‌రింగ్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎమ్.శ్యామ సుందరరావు, నాగార్జున అగ్రికెం వర్కర్స్ యూనియన్ నాయకులు ఎల్.వరదరాజు, పి.అన్నాజీరావు, మందస మండల నాయకులు ఆర్.దిలీప్ కుమార్, కె. కేశవరావు, బి.లచ్చయ్య, వై.గాయత్రీ, బి.యశోద, జి.మహాలక్మి ఉన్నారు.