మెట్టు దిగని మమత.. పట్టు వదలని ప్రభుత్వం

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి):
యూపీఏకు తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్నా, కేంద్రం మాత్రం డీజిల్‌, గ్యాస్‌ ధరలు, చిల్లర వర్తక వ్యాపారంపై పట్టు వీడడం లేదు. ఇటు కాంగ్రెస్‌ గానీ, అటు మమత బెనర్జీ గానీ ఒక్క అంగుళం వెనక్కు తగ్గడం లేదు. టీఎంసీ తమను వీడినా కావలసినంత సంఖ్యా బలం ఉందని కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణం విశ్వాసంతో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ మట్టుకు గోడ మీది పిల్లిలా వ్యవహరిస్తున్నది. ఈ పార్టీకి 22 మంది ఎంపీలున్నారు. అవిశ్వాసమే వస్తే ఏం చేసేది ఆ పార్టీ సస్పెన్స్‌లో ఉంచింది. తృణ మూల్‌కు 19 మంది ఎంపీలున్నారు. యూపీఏలో మొన్నటి వరకు ఇదే అతిపెద్ద భాగస్వామ్య పక్షం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పూర్తిగా రద్దు చేయాలని, పెంచిన డీజిల్‌ ధరను తగ్గించాలని, 6కు తగ్గించిన వంట గ్యాస్‌ సిలిండర్లను 24కు పెంచాలని టీఎంసీ పట్టుబడుతున్నది. టీఎంసీ వైదొలగడంతో యూపీఏ సంఖ్యా బలం 254కు చేరుతుంది. లోక్‌సభలో మెజార్టీకి ఇంకా 19 మంది ఎంపీల అవసరముంటుంది. అయితే, ఎస్‌పి, బీఎస్‌పీ, జేడీఎస్‌, ఆర్‌జేడీ యూపీఏకు బయటి నుంచి మద్దతునిస్తున్నాయి. వీరందరి మద్దతులో బలం 300 కాగలదు. సభలో స్థానాల సంఖ్య 545. సంక్షోభం తలెత్తే అవకాశమున్నందున ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో బుధవారం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. చివరకు మమత బెదిరింపులకు లొంగరాదని కమిటీ నిశ్చయించినట్లు తెలిసింది. సమావేశం తర్వాత ఆర్థిక మంత్రి చిదంబరం మీడియాతో మాట్లాడుతూ తాము తీసుకున్న విధాన నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమతో టీఎంసీ ఎంపీలు మాట్లాడితే అప్పుడు తాము ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నామనే విషయాన్ని వివరిస్తామన్నారు. కాగా, మమత మాత్రం మొండి పట్టుదలతోనే ఉన్నారు. ప్రజా సమస్యలపై రాజీ లేదని స్పష్టం చేశారు. తమ మంత్రులు శుక్రవారం రాజీనామా సమర్పిస్తారని స్పష్టం చేశారు. ఏదేమైనా తాను తన డిమాండ్లకు కట్టుబడి ఉంటానంటున్నారు. ఇలాంటి సమయంలో యూపీఏ గట్టెక్కాలంటే సమాజ్‌వాదీయే దిక్కు. కానీ, ఆ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ తమ వైఖరిని స్పష్టం చేయడం లేదు. తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు గురువారం సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటుందని మాత్రం వెల్లడించారు. ఈ నేపథ్యంలో మమత, కేంద్రం బెట్టు వల్ల యూపీఏ సర్కారు భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది.