మెల్లగా పెరుగుతున్న ఎండలు

విశాఖపట్నం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): మెల్లగా భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. చలి తగ్గడంతో ఎండలు పెరుగుతున్నాయి. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఎండలు ఒక్కసారిగా పెరిగాయి. రాయలసీమలో ఆదివారం పలుచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తిరుపతిలో 37 డిగ్రీలు నమోదైంది. కాగా తెలంగాణ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, దాని నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నది. కోస్తాలో అనేకచోట్ల మంచు కురిసింది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఆదివారం సాయంత్రం నుంచి పడమర గాలులు వీస్తుండంతో ఉత్తర కోస్తాలో రాత్రి చలి వాతావరణం నెలకొంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో కోస్తా, రాయలసీమలో పొడివాతావరణం నెలకొంటుందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.