మేం అధికారంలోకి వస్తే సీఏఏ ఉండదు

– అసోం ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ

శివసాగర్‌(అసోం),ఫిబ్రవరి 14(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టంచేశారు. అసోం ఒప్పందాన్ని మార్చేందుకు, లేదా విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎవరు ప్రయత్నించినా, వారికి కాంగ్రెస్‌ పార్టీతో పాటు అసోం ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా, శివసాగర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, ‘నో సీఏఏ’ పేరుతో ఉన్న కండువాను కప్పుకుని ప్రచారం నిర్వహించారు.అసోం రాష్ట్రాన్ని విడదీసేందుకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని రాహుల్‌ గాంధీ తీవ్రంగా విమర్శించారు. అయితే, అసోం ఒప్పందంలోని ప్రతి అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ రక్షిస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే అసోంతో పాటు దేశంపై ప్రభావం ఉంటుంది కానీ, ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాలపై ఎటువంటి ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రానికి ప్రజల గొంతుక వినే ముఖ్యమంత్రి కావాలని, అంతేగానీ, నాగ్‌పూర్‌, దిల్లీల మాటలకు అనుగుణంగా నడుచుకునే ముఖ్యమంత్రి కాదని వ్యాఖ్యానించారు. కేవలం ఇద్దరు పెద్ద వ్యాపారస్తుల ప్రయోజనం కోసమే వనరులన్నీ దోచిపెట్టేందుకు మోదీ ప్రభుత్వం పయత్నిస్తోందని రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు.ఇక అసోంలో ప్రస్తుతం అధికార పార్టీ భాజపాను ఎలాగైన గద్దె దించాలన్న లక్ష్యంతో భాజపా వ్యతిరేక పార్టీలన్నింటిని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలతో చేతులు కలపనున్నట్లు ఈ మధ్యే ప్రకటించింది. కాంగ్రెస్‌, ఏఐయూడీఎఫ్‌, వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీ అంచాలిక్‌ గణ మోర్చాతో కలిసి కూటమిగా ఏర్పడి భాజపాపై పోరాడనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, భాజపాకు వ్యతిరేకంగా పనిచేసే మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా తమ కూటమిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే, 126 స్థానాలు కలిగిన అసోం శాసనసభకు ఈ ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యాయి.