మేఘాపై సీఎం రేవంత్‌ కు ఎందుకంత ప్రేమ?: కేటిఆర్

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్దం జరుగుతూనే ఉంది. తాజాగా రేవంత్ సర్కర్ రూ.4350 కోట్ల కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించనున్నారని వార్తలు రావడంతో.. బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన ఆ సంస్థకు ఆ పనులు ఎలా అప్పగిస్తారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.

సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటిఆర్ పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇదే మెఘా ఇంజనీరింగ్ కంపెనీ తెలంగాణ సంపదను దోచుకువెళుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించారని కేటిఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు మేఘా సంస్థపై రేవంత్ రెడ్డి ఎందుకింత ప్రేమ, ఔదార్యం చూపిస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని కేటిఆర్ డిమాండ్ చేశారు.