మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్‌

– పార్టీని వీడిన సీనియర్‌ నేత, మాజీ సీఎం లపాంగ్‌
– రాహుల్‌కు లేఖ ద్వారా వెల్లడి
– సీనియర్‌ నేతలను దూరం పెడుతునారని లేఖలో ఆవేదన
షిల్లాంగ్‌, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 40ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో పనిచేసి, ఐదు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సీనియర్‌ నేత డీడీ లపాంగ్‌ పార్టీ నుంచి వైదొలిగారు. సీనియర్‌ నేతలను పార్టీలో దూరం పెడుతున్నారని అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖ ద్వారా వెల్లడించారు. నాఅభిప్రాయం ప్రకారం సీనియర్‌ నేతల సేవలు, సూచనలు పార్టీకి ఇక నిరుపయోగమని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుగా ఉందని, ప్రజలకు సేవచేయాలనే తపన, ఆసక్తి నాలో ఉన్నప్పటికీ పార్టీ ప్రవర్తిస్తున్న తీరు నన్ను ఎంతో అసంతృప్తికి గురిచేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇక నేను పార్టీలో సానుకూలంగా ఉండలేనని, అందుకే భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని లంపాంగ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో నేను ఇక పనిచేయలేనని, ఇప్పుడే పార్టీ నుంచి వైదొలుగుతున్నానని తెలిపారు. ఈ వయసులోనూ నా ఆరోగ్యం బాగానే ఉందని, నేను ఎక్కడ ఉన్నా ఈ ప్రజల కోసమే పనిచేస్తానని లపాంగ్‌ లేఖలో పేర్కొన్నారు.
84ఏళ్ల లపాంగ్‌ గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే లంపాంగ్‌ సాగుతున్నారు. 1972 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న లపాంగ్‌ 1993లో కేవలం ఒకే ఒకసారి ఓటమి చవిచూశారు. రాష్ట్రానికి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. గతేడాది కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి లపాంగ్‌ను అధిష్టానం తప్పించింది. దీంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లపాంగ్‌ రాజీనామా కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో 20సీట్లతో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. 19సీట్లు వచ్చిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) భాజపా, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.