మేమే అంబానీ కంపెనీని ఎంచుకున్నాం

మేమే అంబానీ కంపెనీని ఎంచుకున్నాం- రిలయన్స్‌తో పాటు మరో 30 భాగస్వామ్య కంపెనీలున్నాయి
– స్పష్టం చేసిన డసో సీఈఓ ఎరిక్‌ ట్రాప్పీయర్‌
న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వివాదంపై ఎట్టకేలకు ఫ్రాన్స్‌ డిఫెన్స్‌ కంపెనీ డసో స్పందించింది. ఈ ఒప్పందంలో తమ కంపెనీనే స్వయంగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ కంపెనీని ఆఫ్‌సెట్‌ పార్ట్‌నర్‌గా ఎంపిక చేసుకుందని డసో సీఈఓ ఎరిక్‌ ట్రాప్పీయర్‌ ఏఎన్‌ఐ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంబానీని మేమే స్వయంగా ఎంపిక చేసుకున్నామని, రిలయన్స్‌ కాకుండా మాకు మరో 30భాగస్వామ్య కంపెనీలు ఉన్నాయన్నారు. నేను వెల్లడించిన విషయాలు వాస్తవాలు, అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు, సీఈఓగా నా స్థానంలో ఉంటే.. విూరు కూడా అబద్ధాలు చెప్పరు.’ అని ఎరిక్‌ పేర్కొన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధాని మోదీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. 36 రఫేల్‌ యుద్ద విమానాల కొనుగోలుకు ప్రభుత్వం రూ.59వేల కోట్లతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా భారత్‌లోని రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసింది. ఇటీవల రాహుల్‌ ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ డసో కంపెనీ సీఈఓ అబద్ధాలు చెప్తున్నారని, విచారణ మొదలైతే మోదీ తట్టుకోలేరని, అందుకు నేనే గ్యారెంటీ ఇస్తానని విమర్శలు గుప్పించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై డసో సీఈఓ స్పందించారు. తాను ఎలాంటి అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో డీల్‌ చేసిన అనుభవం తనకు ఉందని, రాహుల్‌ మాటలు విచారకరమని అన్నారు. 1953లో భారత్‌తో తొలి ఒప్పందం కుదిరిందని, నెహ్రూ సహా చాలా మంది ప్రధానులతో కలిసి పనిచేశామని ఎరిక్‌ తెలిపారు. తాము భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని, పార్టీలతో కాదని స్పష్టం చేశారు.