మోడీతో పవన్‌,జగన్‌ చీకటి ఒప్పందాలు

 

మోడీ ద్రోహాన్ని ఎండగట్టేందుకే ప్రజాపోరాట దీక్ష

నేటి విజయనగరం సభపై మంత్రి కళా వెంకట్రావ్‌

విజయనగరం,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కోడికత్తి నేత, పవన్‌లు మోడీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. విజయనగరంలో మంగళవారం నిర్వహించనున్న సిఎం ధర్మపోరాట దీక్షకు ముస్తాబవుతున్న అయోధ్య మైదానాన్ని టిడిపి నేతలు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ ధర్మ పోరాట దీక్ష చేపట్టారని చెప్పారు. మోడీ నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, నోట్లరద్దు, ఆర్బీఐ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సిబిఐలో అతి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని దుయ్యబట్టారు. ఎపికి నష్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ, మోడీ వైఖరికి నిరరసనగా ఈ నెల 27 న ధర్మపోరాట దీక్ష నిర్వహించనున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ. 350 కోట్లు కేంద్రం వెనక్కి తీసుకుందని తెలిపారు. బిజెపి వ్యతిరేక పార్టీలను కలుపుకుని కూటమి ఏర్పాటు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కోడికత్తి పార్టీ నాయకుడు, జనసేన అధ్యక్షుడు మోడీ స్నేహం చేస్తూ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ధర్మ పోరాట దీక్ష కు విజయనగరం జిల్లా వాసులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం జగన్‌ పై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి బయట పడటానికి, కేసుల నుంచి బయటపడటానికి మాత్రమే జగన్‌ పార్టీని అడ్డంపెట్టుకుంటున్నారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ప్రయోజనాలు జగన్‌ కి అక్కర్లేదని, చంద్రబాబు కేంద్రంతో పోరాడుతుంటే జగన్‌ స్వీయ సారధ్యం వహించి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో మహాకూటమి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. కెసిఆర్‌కు అనుకున్న సానుకూలత లేదని, పరిస్థితులు మారుతున్నాయని, ప్రజలు మహాకూటమి వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి

కళా వెంకట్రావు, రాష్ట్ర మంత్రి సుజాయ్‌ కృష్ణ రంగారావు, ఎంపి అశోక్‌ గజపతి రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.