మోడీ సమర్థుడని ప్రజలు భావించారా?

విపక్షాల్లో అనైక్యత కూడా కొంపముంచిందా?
విపక్షాల్లో కానరాని నాయకత్వ పటిమ
ఎన్నికల్లో బాలాకోట్‌ దాడులపై విమర్శల ప్రభావం
న్యూఢిల్లీ,మే20(జ‌నంసాక్షి): దేశానికి సమర్థ నాయకత్వం అవసరమని ప్రజలు భావించినట్లుగా కనిపిస్తోంది. అలాగే విపక్షాల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానికి కూడా స్పస్టత లేకపోవడం కూడా ప్రజలు మోడీ వైపు మొగ్గు చూపి ఉంటారు. నిస్వార్థం, అంకితభావంతో సేవలు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి సానుకూలంగా భారీగా పోలింగ్‌ జరిగిందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టంగా చెబుతున్నాయి. సుపరిపాలన అందించిన మోదీకి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. మోదీపై నిరాధార ఆరోపణలు, అబద్దాలు చెప్పిన ప్రతిపక్షాలు ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివి. రాహుల్‌ నాయకత్వంపై విపక్షాల్లో ఐక్యత లేదు. ప్రధాని పదవికి మేమంతా అన్న రీతిలో ప్రచారం సాగింది. మమతా బెనర్జీ, మాయావతి, శరద్‌ పవార్‌, అఖిలేశ్‌ యాదవ్‌ తదితర నేతలంతా తెరపై కనిపించారు. దీంతో కూడా కొంత గందరగోళం కనిపించి ఉంటుంది. అందుకే మోడీవైపు మరోమారు మొగ్గు చూపి ఉంటారని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను బట్టి అంచనా వేయవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 272 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా భాజపా ఆధ్వర్యంలోని ఎన్‌డీయే కూటమి 300కుపైబడి సీట్లను గెలుచుకుంటుందని కొన్ని సర్వేలు పేర్కొన్నాయి. రెండు సంస్థలు మాత్రం ఎన్‌డీఏకు మెజార్టీ తగ్గినా, అతి పెద్ద కూటమిగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డాయి. యూపీఏ కూటమికి గతంలో కన్నా స్థానాలు పెరిగినా, అధికారం కోసం సవాలు చేసేటంతటి సీట్లు రావని పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో భాజపాకు సొంతంగా 282 సీట్లు, ఎన్‌డీఏ కూటమికి 336 స్థానాలు లభించాయి. కాంగ్రెస్‌ 44 స్థానాలకే పరిమితమయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు గట్టి దెబ్బతగులుతుందని దాదాపు అన్ని సర్వేలూ పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకుగానూ భాజపా 71, మిత్రపక్షమైన అప్నాదళ్‌ రెండు సీట్లను గెలుచుకున్నాయి. ఈసారి ఎస్పీ-బీఎస్పీ కూటమికి మెజార్టీ సీట్లు లభిస్తాయని అంచనా వేశాయి. భాజపా దాదాపుగా సగానికి సగం స్థానాలను కోల్పోనుంది. ఓ సంస్థ అయితే కేవలం 22 సీట్లే వస్తాయని తెలిపింది. ఆమేరకు పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల్లో సీట్లను పెంచుకోనుందని అంచనా వేశారు. . పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు వచ్చాయి. ఇప్పుడు 11-16 స్థానాలు వస్తాయని రెండు సంస్థలు తెలిపాయి. ఒడిశాలో మొత్తం 21 నియోజకవర్గాలు ఉండగా, గతంలో భాజపాకు ఒక్కటే లభించింది. ఇప్పుడు 9 వరకు రావొచ్చని ఓ సంస్థ అంచనా వేసింది.  కీలకమైన హిందీ రాష్ట్రాల్లో భాజపా తన ప్రాభవాన్ని మరోసారి నిలుపుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఓడిపోయినప్పటికీ అక్కడ మళ్లీ పుంజుకోనుంది. రాజస్థాన్‌లోని మొత్తం 25 స్థానాల్లో 22, మధ్యప్రదేశ్‌లో 29కిగానూ 25, ఛత్తీస్‌గఢ్‌లో 11కుగానూ ఏడు గెలుచుకుంటుందని సర్వేలు వెల్లడించాయి. దేశ రాజధాని దిల్లీలో మొత్తం ఏడు స్థానాలను కైవశం చేసుకుంటుందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. బిహార్‌లో నీతీశ్‌తో పొత్తు లబ్ది కలిగించనుందని, మొత్తం 40 స్థానాల్లో 31 ఎన్‌డీఏకు వస్తాయని తెలిపాయి. మొత్తంగా ఫలితాలను బట్టి దేశంలో మరోమారు మోడీ నాయకత్త్వంతో పాటు ఇతర అంశాలకు కూడా ప్రజలు ప్రభావితం అయ్యారనే చెప్పాలి. ప్రధానంగా బాలకోట్‌ దాడులపై విపక్షాలు అనవసరంగా విమర్వలు చేశాయి. ఇది కాంగ్రెస్‌ను బాగా దెబ్బతీసిందనే చెప్పవచ్చు. అయితే ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాక దీనిపై స్పష్టమైన విశ్లేషణకు అవకాశం ఉంటుంది.