మోదీకి క్లీన్‌చిట్‌పై విచారణ


– ఈనెల 19న విచారణ చేపట్టనున్న సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకి సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జాఫ్రి భార్య జాకియా జాఫ్రి వేసిన పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ నెల 19న దీనిపై విచారణ చేపట్టనుంది. గుల్‌బర్గ్‌ సొసైటీ హత్యాకాండలో మోదీకి ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ గతేడాదే జాకియా జాఫ్రీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా.. దానిని ధర్మాసనం నిరాకరించింది. గుల్బర్‌ సొసైటీ నరమేథం కేసు 2002లో సంచలనం సృష్టించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ నరమేథంలో కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జాఫ్రీ
సహా సుమారు 68 మందిని అల్లరిమూక పొట్టనపెట్టుకుంది. జకియా జాఫ్రి చేసిన ఆరోపణలపై 2008లో సిట్‌ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010లో మోదీని సిట్‌ 9 గంటలకు పైగా విచారించింది. అనంతరం, మోదీ, మరో 59 మందిపై ‘ప్రాసిక్యూషన్‌ ఎవిడెన్స్‌’ లేదంటూ క్లోజర్‌ రిపోర్ట్‌లో సిట్‌ పేర్కొంది. దీనిపై జాఫ్రి, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ 2012 ఫిబ్రవరి 9న మెట్రో పాలిటన్‌ కోర్టులో సవాలు చేశారు. మోదీకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని తమ పిటిషన్‌లో ప్రశ్నించారు. అయితే సిట్‌ రిపోర్ట్‌ను దిగువ కోర్టు సైతం సమర్ధించడంతో, ఆ తదుపరి క్రమంలో జాఫ్రి, సెతల్వాద్‌ గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లారు. 2017 జూలై 3న కేసు విచారణ పూర్తయింది. మోదీకి, ఇతరులకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. దీనిని పైకోర్టులో సవాలు చేసుకునే వీలు జాఫ్రికి కోర్టు కల్పించింది. దీంతో జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిబంధనలను దిగువ కోర్టులు పాటించలేదని, సాక్షులు సంతకం చేసిన స్టేట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకోలేదని, ఈ ఘటనల వెనుక కుట్ర ఉందని జాఫ్రి ప్రతినిధులు ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.