మోదీ, షా, జగన్ కుమ్మక్కుతోనే.. ఉపఎన్నికలు రాలేదు
-వీరికంటే వెనుక రాజీనామాచేసిన కర్ణాటకలోని మూడు స్థానాల్లో ఎన్నికలొచ్చాయి
– దీంతో వీరి కుమ్మక్కు ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతుంది
– ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు
అమరావతి, అక్టోబర్10(జనంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమ్మక్కు కావడంతోనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు రాలేదనే వాస్తవం వెల్లడైందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన ఆ ఐదు స్థానాలకు ఎందుకు ఉపఎన్నికలు రాలేదో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వీళ్లకన్నా నెలా 10రోజుల వెనుక రాజీనామా చేసిన మూడు స్థానాలకు కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయని యనమల గుర్తు చేశారు. కానీ, ఏపీలో వైసీపీ రాజీనామా చేసిన ఐదు స్థానాలకు ఉపఎన్నికలు రాలేదంటేనే అందులో కుమ్మక్కు బైటపడిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జగన్ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు రాకుండా, వాటి ఆమోదంలో తాత్సారానికి బాధ్యత ఎవరిదని యనమల ప్రశ్నించారు. స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి 52రోజులు తాత్సారం అయ్యేలా చేసిందెవరంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు రూ.450 కోట్లు విడుదల చేసి, ఏపీలోని ఏడు జిల్లాలకు అన్యాయం చేయడాన్ని ఏమనాలని యనమల ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాలకు సాయం చేయాలని ఒకే చట్టం చెప్పిందని, మరిఏపీకి ఇచ్చినది వెనక్కి తీసుకున్నారని యనమల మండిపడ్డారు. ఈ విషయాలపై ప్రజలు గమనిస్తున్నారని కేంద్రానికి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని యనమల హెచ్చరించారు.