మోదీ హయాంలో.. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది

– జీఎస్టీతో చిన్న వ్యాపార సంస్థలు కుదేలయ్యాయి
– నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది
– త్రివిధ దళాలు తన సొంత ఆస్తులు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు
– యూపీయే హయాంలో మెరుపుదాడుల్ని వీడియోగేమ్స్ అంటారా?
– సైనికులను మోదీ అవమానిస్తున్నారు
– అవినీతిపై చర్చకు ఎన్నిసార్లు ఆహ్వానించినా స్పందన లేదు
– భాజపా ఓటమి ఖాయం.. ప్రజలంతా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, మే4(జనంసాక్షి) : మోదీ ఐదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా శనివారం ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.. ఈ సందర్భంగా భాజపా, మోదీ ప్రభుత్వంపై రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల పాలనలో దేశాన్ని అన్ని రంగాల్లో మోదీ బ్రష్టు పట్టించారని విమర్శించారు. ఏకపక్ష పాలనతో పేద, మధ్య తరగతి ప్రజలను కష్టాల్లోకి నెట్టివేశాడని విమర్శించారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలు దేశాన్ని తీవ్ర అఘాతంలోకి నెట్టివేశాయని రాహుల్ అన్నారు. జీఎస్టీతో చిన్న వ్యాపార సంస్థలు కుదేలయ్యారని, నోట్ల రద్దు లాంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రరూపందాల్చిందన్నారు.
యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హావిూ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్డీయే హయాంలో అవినీతి అక్రమాలు భారీగా చోటు చేసుకున్నాయని, వీటినిపై ప్రధానిని నిలదీసినా ఆయన బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా కనీసం స్పందించక పోవటం సిగ్గుచేటన్నారు. అవినీతిపై చర్చకు ఎన్నిసార్లు ఆహ్వానించినా మోదీకి అందుకు సమయమే లభించడం లేదని రాహుల్ విమర్శించారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించి బహిర్గతమయిన పత్రాలు ప్రధానమంత్రి కార్యాలయ జోక్యాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. త్రివిధ దళాలు తన సొంత ఆస్తులు అన్నట్లు మోదీ ప్రవర్తిస్తున్నాడని, ఈ విధానం తప్పని నరేంద్ర మోదీ గుర్తుంచుకోవాలన్నారు. యూపీఏ హయాంలో జరిగిన మెరుపుదాడుల్ని మోదీ.. వీడియో గేమ్స్‌గా అభివర్ణించడం ద్వారా సైన్యాన్ని అవమానించారన్నారు. ఐదేళ్ల పాలనలో మోదీ ఒక్కసారి కూడా విూడియా సమావేశం నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. చౌకీదార్ ఛోర్ హై అన్న వ్యాఖ్యలపై చెలరేగిన దుమారాన్ని ప్రస్తావిస్తూ.. సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలకు మాత్రమే తాను క్షమాపణలు చెప్పానని.. మోదీకో లేదా భాజపాకో కాదని రాహుల్ వివరించారు. అలాగే ‘చౌకీదార్ ఛోర్ హై’ అన్న నినాదం మాత్రం కొనసాగుతుందన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌పై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఉగ్రవాదానికి తలొగ్గి అతణ్ని విడుదల చేసింది భాజపాయే అని గుర్తుచేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో నాయకులు రూపొందించిన పత్రం కాదని.. అది ప్రజల గళాన్ని వినిపిస్తోందని వ్యాఖ్యానించారు. రైతులను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి
ప్రత్యేక పథకాలు రూపొందించామన్నారు. నరేంద్ర మోదీ హయాంలో కుదేలైన దేశ ఆర్థిక రంగం కనీస ఆదాయ పథకం ‘న్యాయ్’తో ఊపందుకుంటుందన్నారు.



