యురికి ప్రతీకారంగానే సర్జికల్‌ దాడులు చేశాం

– నార్తర్న్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌
న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : యురి ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్‌లో సర్జికల్‌ దాడులు జరిగినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. ఆర్టీఐకి సమాధానం ఇస్తూ ఆర్మీ ఈ విషయాన్ని వ్యక్తం చేసింది. సర్జికల్‌ దాడుల గురించి నార్తర్న్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ సోమవారం విూడియాకు కూడా కొన్ని విషయాలను వెల్లడించారు. సర్జికల్‌ దాడుల పట్ల రాజకీయ నేతల వ్యాఖ్యలపై స్పందించబోనన్నారు. రాజకీయ పార్టీలకు ప్రభుత్వమే సమాధానం ఇస్తుందన్నారు. సర్జికల్‌ దాడుల గురించి తాను వెల్లడించింది కేవలం వాస్తవం మాత్రమే అని రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడులకు సంబంధించిన అంశాలను కూడా ఆయన తెలియజేశారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని గొప్ప విజయంగా కీర్తించారు. శత్రువుల భూభాగంలోకి వెళ్లి మన విమానాలు ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే మరుసటి రోజు పాక్‌ తన యుద్ధ విమానాలతో సరిహద్దకు వచ్చినా.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. ఉడీ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగానే భారత ఆర్మీ తొలిసారి 2016 సెప్టెంబర్‌లో సర్జికల్‌ స్టైక్స్‌ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మీ సర్జికల్‌ స్టైక్స్‌ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సర్జికల్‌ స్టైక్స్‌ తొలిసారి తామే నిర్వహించామని బీజేపీ చెప్పుకుంటుండగా… ఆ వాదనను కాంగ్రెస్‌ పార్టీ తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో భారత ఆర్మీ ఆరుసార్లు సర్జికల్‌ స్టైక్స్‌ జరిపినట్టు కాంగ్రెస్‌ చెప్పుకొచ్చింది. ఆ పార్టీ సీనియర్‌ నేత రాజీవ్‌ శుక్లా తమ హయాంలో ఎప్పుడెప్పుడు సర్జికల్‌ స్టైక్స్‌ జరిగాయో తేదీలతో సహా వెల్లడించారు. తమ హయాంలో సర్జికల్‌ దాడులు జరిగినా.. వాటి క్రెడిట్‌ ఎప్పుడూ తీసుకోలేదని, మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, వాజపేయి ఈ దాడులపై ఎన్నడూ విలేకరుల సమావేశం నిర్వహించి.. తమదే ఘనత చెప్పుకోలేదని ఆయన బీజేపీని దుయ్యబట్టారు. అయితే, మోదీ హయాంలోనే తొలిసారి సర్జికల్‌ స్టైక్స్‌ జరిగాయని ధ్రువీకరిస్తూ ఆర్మీ టాప్‌ కమాండర్‌ వ్యాఖ్యలు
చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ గుర్రుగా ఉంది.