యువతకు భరోసా.  ‘ముఖ్యమంత్రి యువనేస్తం’


– అర్హులందరికి పథకాన్ని వర్తింపజేస్తాం
– పథకానికి 6.15లక్షల మంది నమోదు చేసుకున్నారు
– వారిలో 2.15లక్షల మందిని అర్హులుగా గుర్తించాం
– బుధవారం వారి ఖాతాల్లో సొమ్ములు జమచేస్తాం
– యువత ఓ నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగాలి
– అనుకున్నది సాధించేవరకు లక్ష్యాన్ని వీడొద్దు
– నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– ఉండవల్లిలో ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు
– పలువురు లబ్ధిదారులతో ముఖాముఖీ మాట్లాడిన సీఎం
అమరావతి, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : చదువుకున్న తర్వాత తల్లిదండ్రులపై ఆధార పడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని ప్రజావేదిక హాలులో ‘యువనేస్తం’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా 13జిల్లాల నుంచి వచ్చిన 400మంది లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతలు గాంధీజీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి జన్మించిన రోజున ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలోనే యువతరం ఎక్కువగా ఉన్న దేశం మనదేనని తెలిపారు. అర్హులైన యువత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే వారి ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించి పథకాన్ని వర్తింపచేస్తారని తెలిపారు. ఈ పథకానికి 6.15లక్షల మంది నమోదు చేసుకోగా… వెరిఫికేషన్‌ తర్వాత సుమారు 2.15లక్షల మంది అర్హత సాధించినట్లు తెలిపారు. వీరి బ్యాంక్‌ అకౌంట్‌కు ప్రయోగాత్మకంగా సోమవారమే రూపాయి జమచేశామన్నారు. మిగిలిన రూ.999 బుధవారం జమ అవుతుందని చెప్పారు. గతంలో ఇలాంటి పథకాలు కొన్నిచోట్ల ప్రారంభించినా విఫలమయ్యాయని.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. భారతదేశం యొక్క శక్తి, సామర్ధ్యం యువతరమే అని అన్నారు. మిగతా దేశాల్లో యువత తక్కువ…వృద్దుల సంఖ్య ఎక్కువ అని పేర్కొన్నారు. భారతదేశంలోనే యువత సంఖ్య అత్యధికమని సీఎం తెలిపారు. యువత శక్తి సామర్ధ్యాలను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. యువతకు భరోసా, చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం విజయవంతం కాలేదని, కానీ తాము చిత్తశుద్ధితో దీనికి రూపకల్పన చేశామని చంద్రబాబు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని స్పష్టం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పథకం లబ్ధిదారులతో ముఖాముఖీలో మాట్లాడారు.. మనం ఉన్నతంగా ఎదగాలంటే చదువుతు, సంస్కారం ఎంతో ముఖ్యమన్నారు. ఇన్నోవేషన్‌కు పెద్దపీట వేస్తున్నామని, నైపుణ్య శిక్షణ సంస్థలతో ట్రైనింగ్‌ ఇప్పించి ప్లేస్‌మెంట్‌ వచ్చేలా చేస్తామని అన్నారు.
జ్ఞానాన్ని సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా అందిస్తున్నామనేది విశ్వవిద్యాలయాల విధానం కావాలని బాబు ఆకాంక్షించారు. స్వయం ఉపాధికి ముందుకొచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఓ ఏడాది పాటు అప్రంటీస్‌గా పనిచేసి అనుభవాన్ని సంపాదించాలని, అది ఉద్యోగం వచ్చేలా ఉపకరిస్తుందని యువతకు సూచించారు. నిత్య విద్యార్ధిలా ఉన్నప్పుడే అందరికంటే ముందుకు వెళ్లగలమన్నారు. నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సీఎం సూచించారు. ఎన్నో కార్యక్రమాలు ఈ నాలుగున్నరేళ్లలో చేపట్టినా తన మనసుకు అత్యంత దగ్గరైన కార్యక్రమం ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ అని చెప్పుకొచ్చారు. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఏదైనా సాధించగలమన్నారు. అనునిత్యం లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 20 ఏళ్ల క్రితం ఐటీకి పునాదులు వేశామని, ఇప్పుడు ఐటీ రంగంలో ఎక్కడ చూసినా తెలుగువారున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అది చూస్తే తనకు చాలా గర్వంగా ఉంటుందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుందని తెలిపారు. ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదు ఇది అని సీఎం అన్నారు. డిజిటల్‌ లిటరసీలో అందరూ రాణించాలని తెలిపారు. ప్రపంచంలో చాలా దేశాలు వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నాయని, దేనికైనా లక్ష్యం పెట్టుకుని పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్య శిక్షణ పెంపొందించడంపై ఫాక్స్‌కాన్‌, కియా మోటర్స్‌, బ్రాండెక్స్‌ ప్రతినిధులు అభినందించారని ఈ సందర్భంగా తెలిపారు. యువనేస్తంతో మానవ వనరుల లభ్యత సులభమవుతుందని అన్నారు. నీరు కూడా లేని అనంతపురం జిల్లాలో కియా మోటర్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థ వస్తుందని ఎవరైనా ఊహించారా? అని సీఎం అన్నారు. కియా సంస్థకు నీరు ఇచ్చామని, జనవరిలో మొదటి కారు వస్తుందని తెలియజేశారు. శ్రీసిటీలో ఫాక్స్‌కాన్‌ ఏర్పాటుకు సహకరించామని చంద్రబాబు అన్నారు. రెడీమేడ్‌ గార్మెంట్స్‌లో బ్రాండెక్స్‌ అత్యున్నత స్థాయికి ఎదుగుతోందన్నారు. తిరుపతిని ఆటోమొబైల్‌ హబ్‌గా, ఎలక్టాన్రిక్స్‌ హబ్‌గా తయారు చేస్తామని సీఎం పేర్కొన్నారు. మెజారిటీ ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చూస్తున్నామని, నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగాలు తమని వెతుక్కుంటూ వస్తాయన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు, కష్టపడేవారికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు.

తాజావార్తలు