యూపి ఎన్నికల్లో కనిపించని ప్రియాంక ఎఫెక్ట్‌ 

ఎస్పీ,బిఎస్పీ కూటమి కొంత మేర విజయం సాధించినట్లే
న్యూఢిల్లీ,మే20(జ‌నంసాక్షి): గతేడాది చివర్లో జరిగిన మూడు రాష్ట్రాల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడం,కాంగ్రెస్‌ బలం పుంజుకోవడంతో కాంగ్రెస్‌లో ఆశలు చిగురించాయి. కేంద్రంలో మళ్లీ పాగా వేస్తామని భ్రమించారు. ప్రధానంగా రాహుల్‌ నాయకత్వంపై ఉన్న అనుమానాలు తొలిగాయని అంతా భావించారు. మోదీ సర్కారు తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు, వ్యవసాయ సంక్షోభం, యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి మొదలైన కారణాలతో మోదీకి ఎదురుగాలి వీస్తోందని కాంగ్రెస్‌ శ్రేణులు భావించాయి. అందుకే అతిపెద్ద రాష్ట్రమైన  యూపిలో పట్టు సాధించేందుకు పొత్తులు పెట్టుకోవాలన్న కాంగ్రెస్‌ ఆశలపై ఎస్పీ,బిఎస్పీ నీళ్లు చల్లింది. దీంతో ప్రియాంకను రంగంలోకి దింపారు. ఆమె కూడా బాగానే ప్రచారం చేశారు. మోడీని తూర్పారా బట్టారు. గుల్లూగోపురాలు తిరిగి పూజలు పునస్కారాలు చేశారు. అయినా పెద్దగా ఫళితం కనబడలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చూసిన తరవాత ప్రియాంక ప్రభావం యూపిలో లేదన్న భావన వ్యక్తం అవుతోంది. బాలాకోట్‌ దాడుల ప్రభావం బీజేపీకి నైతిక బలాన్నిస్తుందని భావించినప్పటికీ.. వ్యవసాయరంగ సమస్యలు, నిరుద్యోగుల్లో అసంతృప్తి వంటివాటిపైనే కాంగ్రెస్‌ ప్రధానంగా దృష్టిసారించింది. దీంతో బీజేపీకి ఎదురుగాలి తప్పదని.. కాంగ్రెస్‌ పరిశీలకులు అంచనా వేశారు. ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్‌కు బలాన్నిస్తుందని భావించారు. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 336 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెస్‌కు 44 వచ్చాయి. అయితే, మోదీ హవా ఏ మాత్రం తగ్గలేదని,
రాహుల్‌గాంధీ, ప్రియాంకలు అనుకున్నంతగా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. దక్షిణభారతంలో మాత్రం బీజేపీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయలేదని.. మొత్తంగా 30 స్థానాల్లోపే ఉండొచ్చని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఇకపోతే తమిళనాడులో డిఎంకె పుంజుకుందనే చెప్పాలి. అక్కడ  భారతీయ జనతా పార్టీ ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్‌తో జతకట్టిన డీఎంకే 26 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. న్యూస్‌ 24-టుడేస్‌ చాణక్య సర్వే ప్రకారం డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి 31 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. అన్నాడీఎంకే – బీజేపీ కూటమి కేవలం ఆరు స్థానాలకు పరిమితం కానున్నట్లు అంచనాలు వేసింది. 2014 సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒంటరిగా పోటీ చేసి 37 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా రెండు స్థానాల్లో బీజేపీ, పీఎంకే గెలిచాయి.