యూపీఏకు.. రాం..రాం
మంత్రి వర్గంలో నుంచి బయటకు..
శుక్రవారం మంత్రుల రాజీనామా
‘బొగ్గు’ దృష్టి మరల్చేందుకే ‘చిల్లర’ పనులు
మమతాబెనర్జీ వెల్లడి
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 18 (జనంసాక్షి) : కేంద్రంలో అనుకున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొల గాలని మంగళవారం సాయంత్రం నిర్ణయిం చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ అధికారికంగా ప్రకటించారు. కలకత్తాలో సమావేశమైన తృణమూల్ సీనియర్ నాయకుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్రవారం పార్టీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు మమత తెలిపారు. అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణం నుంచి దేశం దృష్టిని మరల్చేందుకు కేంద్రం ఎఫ్‌డీఐలను తెర మీదకు తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రం పదే పదే ధరలను పెంచుతున్నందున, ఈ ప్రజా వ్యతిరేక చర్యలను తట్టుకోలేకనే యూపీఏ నుంచి వైదొలగాలని నిర్ణయం
తీసుకున్నామని ఆమె వివరించారు. కేంద్రంలో తమకు సరైన గౌరవం దక్కలేదని, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో గానీ, రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల విషయంలోనూ తీసుకున్న నిర్ణయాల్లో తమను సంప్రదించలేదని మమత విమర్శించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తృణమూల్‌కు చెందిన 19 మంది ఎంపీలు యూపీఏ నుంచి బయటకు వచ్చినా అటు సమాజ్‌వాదీ పార్టీ, 22 మంది ఎంపీలతో, బీఎస్‌పీ 21 మంది ఎంపీలతో యూపీఏకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిలబడడానికి 272 మంది సభ్యులు అవసరంగా ఎస్‌పీ, బీఎస్‌పీ మద్దతిస్తే యూపీఏకు నష్టం వాటిల్లే పరిస్థితులు కనబడడం లేదు.