యూపీఏ సమావేశంలో ‘ప్రత్యేక’ ప్రస్తావన !
న్యూఢిల్లీ : లోక్‌సభ మొదటి రోజు సమావేశం అనంతరం బుధవారం రాత్రి యూపీఏ సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు యూపీఏ మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను కలిసి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చించాలని కోరారు. దీనిపై సానుకూలంగా మంత్రి ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని సమావేశంలో లేవనెత్తినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, సోనియా ఈ విషయంపై ఎలా స్పందించారన్నది మాత్రం తెలియరాలేదు. తెలంగాణ ప్రకటన చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారా లేదా అన్నది స్పష్టం కాలేదు. యూపీఏ సమన్వయ సంఘం సమావేశం ప్రారంభం కావడానికి ముందు గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు శరద్ పవార్‌ను కలుసుకున్నారు. తెలంగాణ అంశాన్ని సమావేశంలో లేవనెత్తేలా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అందుకు సానుకూలంగా స్పందించిన పవార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూ లంగా తాను కచ్చితంగా వాదిస్తానని టీఎంపీలకు హామీ ఇచ్చారు. యూపీఏ తెలంగాణ ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని, ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతానికి, 2014 సార్వత్రిక ఎన్నికలకు ఉపకరిస్తుందని సోనియాకు వివరి స్తానని పవార్ ఎంపీలతో అన్నారు. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేసి, 2013లో ఏదైనా ప్రకటన చేస్తే అది యూపీఏను నష్టపర్చడమే గానీ, లాభం కలిగించదని పవార్ అభిప్రాయపడ్డట్లు తెలిసింది. 2013లో స్పష్టమైన ప్రకటన చేసినా అది 2014 ఎన్నికల్లో నెగ్గుకు రావడానికి యూపీఏ వేస్తున్న ఎత్తుగడగానే తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు భావించే అవకాశముందని ఆయన టీఎంపీలతో వెల్లడించినట్లు సమాచారం. దీని వల్ల రెండు ప్రాంతాల్లోనూ యూపీఏ అభ్యర్థులు నష్టపోతారని పవార్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా డిమాండ్లు వస్తున్నాయని, ఈ నిర్ణయాలను తీసుకోవడంలో ఆలస్యం చేస్తే కాంగ్రెస్‌ను అవకాశవాద పార్టీగా ప్రజలు భావించే అవకాశముందని ఆయన టీఎంపీలతో అన్నారు. కాబట్టి, తాను తప్పక తెలంగాణ ప్రస్తావనను సమన్వయ సమావేశంలో తెస్తానని హామీ ఇచ్చి, అదే విధంగా సమావేశంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సోనియాకు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం.