యోగి మంత్రివర్గం నుండి రాజ్‌బర్‌ ఔట్‌

– రాజబర్‌ను తొలగించాలని గవర్నర్‌కు సీఎం యోగి లేఖ
– ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ రామ్‌ నాయక్‌
– యోగి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్న రాజ్‌బర్‌
లక్నో, మే20(జ‌నంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల చివరి రోజు పోలింగ్‌ ముగిసిన వెంటనే ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి ఓపీ రాజ్‌బర్‌ను పదవి నుంచి తొలగించారు. రాజ్‌బర్‌ను తక్షణమే తొలగించాలని గవర్నర్‌ రామ్‌ నాయక్‌కు యోగి లేఖ రాశారు. సీఎం లేఖను పరిశీలించి రాజ్‌బర్‌ తొలగింపునకు రామ్‌ నాయక్‌ ఆమోద ముద్రవేశారు. కొద్దిరోజుల క్రితమే రాజ్‌బర్‌ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ దానికి ఆమోదం లభించలేదు. తాజాగా మంత్రి పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌కు యోగి సిఫారసు చేయడంతో తాజాగా ఆమోదించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017 నుంచి రాజ్‌బర్‌.. బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో సుహల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌బర్‌కు, బీజేపీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. తాను ఏప్రిల్‌ 13నే రాజీనామా చేశానని మే1న ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ ఎన్నికల గుర్తుపై పోటీచేయాలని కమలం పార్టీ నన్ను కోరిందని, నేను ఒక్క స్థానం నుంచే పోటీచేస్తాను కానీ, అది నా సొంత పార్టీ గుర్తుపై బరిలో దిగుతానని వాళ్లకి చెప్పానన్నారు. ఐతే దీనికి బీజేపీ అంగీకరించలేదని, ఆ కారణంతోనే నేను మంత్రి పదవికి రాజీనామా చేశాను.కానీ, నా రాజీనామాను ఇంకా అంగీకరించలేదని గతంలో వెల్లడించారు. కాగా ప్రస్తుతం తనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని సిఫారసు చేయడంపై రాజ్‌బర్‌ స్పందించారు. యోగి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాని అన్నారు. సామాజిక న్యాయ కమిటీని ఏర్పాటు చేశారని, ఆకమిటీ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో పడేశారన్నారు. ఆ రిపోర్ట్‌లోని మార్గదర్శకాలను అమలుచేసేందుకు సమయం కూడా కేటాయించలేకపోతున్నారన్నారు. తనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఎంత వేగంగా నిర్ణయం తీసుకున్నారో.. అలాగే ఆ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరుతున్నానని రాజ్‌బర్‌ తాజాగా వివరించారు.