రఫేల్‌ ఒప్పందంపై..  సీబీఐ దర్యాప్తు అవసరం లేదు


– రివ్యూ పిటీషన్లను కొట్టివేయండి
– గత డిసెంబర్‌ 14న ఇచ్చిన తీర్పు సరైందే
– తీర్పును సవిూక్షించాల్సిన అవసరం లేదు
– రఫెల్‌ వ్యవహారంపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు
న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : రఫేల్‌ ఒప్పందంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని.. రివ్యూ పిటీషన్లను కొట్టివేయాలని సుప్రింకోర్టును కేంద్రం కోరింది.  ఈమేరకు రఫేల్‌ రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ విషయంపై గత డిసెంబరు 14న ఇచ్చిన తీర్పు సరైనదేనని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ తీర్పును సవిూక్షించాల్సిన అవసరం లేదని తెలిపింది. 36 రఫేల్‌ విమానాల కొనుగోలుకు సంబంధించిన ధరల వివరాలను కాగ్‌కు సమర్పించామని వివరించింది. యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందం కంటే 2.86శాతం తక్కువకే కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరిందన్నారు. పిటిషనర్లు పొందుపరిచిన పత్రాలు రహస్య పత్రాల్లో కొంతభాగమేనని.. అవి ఒప్పంద సమయంలో నిపుణులు ఇచ్చిన సలహాలకు సంబంధించినవని తెలిపింది. అవి తుది ఒప్పందానికి చెందినవి కావని అభిప్రాయపడింది. ఇది దేశ రక్షణకు సంబంధించిన అంశమని.. కావున రహస్య పత్రాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు వివరించింది. సోమవారం సుప్రీంకోర్టులో రఫేల్‌ రివ్యూ పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది.  రహస్య పత్రాల ఆధారంగా విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టవ్యతిరేకంగా సంపాదించిన పత్రాల ఆధారంగా విచారణ చేపట్టడం వల్ల దేశ భద్రతతో పాటు ఆర్థిక ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని.. చివరకు ఇది దేశ ఉనికికే ఓ పెద్ద ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని వివరించింది. రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంలో కేందప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవిూక్షించాలంటూ రివ్యూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు స్పందిస్తూ.. పిటిషనర్లు పొందుపరిచిన రహస్య పత్రాల ఆధారంగా విచారణ చేపట్టడానికి అంగీకరించింది. ఈ అంశం ఏప్రిల్‌ 30న విచారణకు రాగా.. అఫిడవిట్‌ దాఖలుకు నాలుగు వారాల సమయం కావాలని కేంద్రం కోరింది. దీనికి నిరాకరించిన కోర్టు నాలుగు రోజుల్లోగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది.