రాజకీయాల చుట్టూ తెలంగాణ విలీనం

 

అధికారికంగా నిర్వహించడంలో పాలకుల వైఫల్యం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిజాం రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సాగుతున్న రైతాంగ పోరాటాన్ని నివారించడానికి భారత యూనియన్‌ సైన్యాలు 1948 సెప్టెంబరు 13న హైదరాబాద్‌ చేరుకోవడం, రక్తపు బొట్టు చిందకుండా 17న విలీనం చేస్తున్నట్లు నవాబు ప్రకటించడంతో ఆనాడు హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం అయ్యింది. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో ఆనాడు విలీనం కాగానే తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని ఆనాడే అధికారికంగా ప్రకటించకపోవడం వల్ల ఇవాళ ఇంతగా రచ్చ సాగుతోంది. ఓ రకంగా ఆనాటి కేంద్ర సర్కార్‌ రాజకీయంగా దుర్మార్గంగా వ్యవహరించిందనే చెప్పాలి. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగినా, తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్‌ 17ను ఏనాడూ గుర్తించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా సాయుధ పోరాటాన్ని కొనియాడిన కేసీఆర్‌ కూడా అధికారంలోకి వచ్చిన తరువాత మౌనంగా ఉండటం దారుణం. దీని వెనుక ఆంతర్యమేమిటో? మరోవైపు బీజేపీ మాత్రం సెప్టెంబరు 17న విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నది. తెలంగాణ ఉద్యమానికి ఇది కూడా కీలకంగా మారిందనడంలో సందేహం లేదు. మరోవైపు హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉండే కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాంతాల్లో అధికారికంగా ‘సెప్టెంబర్‌ 17’న విలీన దినోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఓ రకంగా ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఉధృతంగా సాగడం వల్లనే రజాకార్లను ఎదుర్కో గలిగారు. ఇవాళ విమోచనోత్సవం కోసం పోరాడుతున్న బిజెపి నేతలు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేయడం లేదు. తెలంగాణలో సాయుధ పోరాటాన్ని గుర్తించ నిరాకరిస్తూ, ఇప్పటికీ స్కీన్రింగ్‌ కమిటీ రికమెండ్‌ చేసిన స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్లను మంజూరు చేయకుండా, పెండింగ్‌లో పెట్టి మొసలికన్నీరు కార్చడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనం. నిజాం నవాబుకు వ్యతిరేకంగా షేక్‌ బందగీ, షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లిం యువకులు బలిదానం కాలేదా? నిజాం

వ్యతిరేక పోరాటయోధులకు ఎంతో మంది ముస్లింలు, ముస్లిం కుటుంబాలు ఆశ్రయాలు కల్పించాయి. తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం అంటే ఉద్యమాన్ని గౌరవించడమే తప్ప మరోటి కాదని పాలకులు గుర్తుంచుకోవాలి.చరిత్రను కనుమరుగు చేయడం తాత్కాలిక చర్య మాత్రమే కాగలదు. మెదక్‌ జిల్లా జోగిపేటలో 1930లో జరిగిన ఆంధ్రమహాసభ తొలి మహాసభలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించి, వెట్టిచాకిరి, తెలుగులో విద్యాబోధన లాంటి అంశాలపై తీర్మానాలు చేశారు. ఆ తదుపరి అలుపెరగని పద్ధతుల్లో ప్రతి సంవత్సరం మహాసభ నిర్వహిస్తూ, 1945లో భువనగిరిలో జరిగిన 15వ మహాసభ నాటికి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నది. నిజాంకు వ్యతిరేకంగా చావోరేవో తేల్చుకోవాలని ఊరూరా సంఘాలుపెట్టి సంఘటితం కావడమే ఏకైక మార్గమనే నిర్ణయానికి రావడం, నిలదీసే ఉద్యమాలకు నాందిగా నిలిచింది. ఆంధ్రమహాసభ పిలుపుతో సాగుతున్న ప్రజా ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీ మరింత ఉత్తేజమిచ్చింది. హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రజల్లో తీవ్ర అసంతృప్తులు నెలకొనడంతో నిజాం నవాబును గద్దెదించి, భారతదేశంలో హైదరాబాద్‌ విలీనం చేయాలనే ధృడసంకల్పం పెరిగింది. ఎట్టకేలకు 1947 సెప్టెంబర్‌ 11న రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌ తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటానికి సంయుక్త పిలుపు నిచ్చారు. మతోన్మాద మజ్లీస్‌ నాయకుడు ఖాసిం రజ్వీ నాయకత్వాన ‘రజాకార్ల’ సంస్థ ఏర్పడి నవాబులకు తొత్తులుగా నిజాం పోలీసులతో కలిసి అనేకచోట్ల ఘోరకృత్యాలకు పాల్పడడం వల్లనే నిజాం అకృత్యాలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీనిని గమనించిన కేంద్రం సైనిక చర్యకు దిగడంతోతెలంగాణ విముక్తం అయ్యింది. ఆ తరవాత నిజాంకు విధేయులైన దేశ్‌ముఖ్‌లు, జవిూందారు, జాగీర్దారు, భ్వూస్వాములందరూ రూటుమార్చి ఖద్దరు ధరించి, కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.