రాజకీయ పార్టీ పెట్టను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాహజారే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన నేపధ్యంలో కల వ్యక్తులు నిలబడితే వారి తరపున ప్రచారం చేస్తానని అన్నారు. లోక్‌ పాల్‌పై ప్రభుత్వం మాటి మాటికీ మోసం చేస్తోందన్నారు. అందువల్ల తాను తిరిగి ఆదివారం నుంచి నిరవధిక దీక్ష చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జనలోక్‌ పాల్‌ వచ్చే వరకు ఆమరణ దీక్ష చేస్తామన్నారు. తాము ప్రభుత్వనికి ఇచ్చిన నాలుగు రోజుల గడువు నేటితో ముగిసిందన్నారు. దీక్షా శిబిరం వద్ద చేరిన సుమారు వేయి మందికి ఆయన అలా చెప్పారు. మంచి వ్యక్తులు పార్లమెంటు లోనికి రాక పోతే వ్యవస్థ బాగుపడదన్నారు. ఓటుకు రూ.15వేల నుంచి రూ.30వేలు చెల్లిస్తున్నారని దాంతో అవినీతిపరులు గద్దెనెక్కుతున్నారని చెప్పారు.