రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మాస్టర్‌ ప్లాన్‌

సిఎం వసుంధరపై పోటీగా మానవేంద్ర సింగ్‌కు టిక్కెట్‌

జైపూర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ రాజకీయాలు వేగంగా మారాయి. బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తు నేత ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీగా నిలబడ్డారు. మాజీ బీజేపీ సీనియర్‌ నేత జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు మాన్‌వేంద్ర సింగ్‌ బరిలో దిగాడు. ఇటీవలే మాన్‌వేంద్ర సింగ్‌ భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరిన సంగతి తెలిసిందే. శనివారం విడుదల చేసిన కాంగ్రెస్‌ రెండో జాబితాలో మాన్‌వేంద్ర సింగ్‌.. జల్రాపటాన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి కూడా వసుంధర రాజే పోటీ చేస్తున్నారు. ఈరోజే ఆమె నామినేషన్‌ పత్రాలు కూడా దాఖలు చేశారు. ఈ నియోజకవర్గంలో వసుంధర రాజేకు మాన్‌వేంద్ర సింగ్‌ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జశ్వంత్‌ సింగ్‌కు బార్మెర్‌ టికెట్‌ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో ఆయన తీవ్రంగా నిరాశ చెంది ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిపై ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు జరిగిన పరిణామాలతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 1980లో పార్టీ స్థాపించినప్పుడు ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న జశ్వంత్‌సింగ్‌ వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తనయుడు బిజెపిలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.