రాజోలు జలాశయంతోనే నీటి సమస్యకు పరిష్కారం

శ్రీశైలం పరిస్థితి కారణంగా దీన్ని చేపట్టాలి: వైకాపా

కడప,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి విమర్శించారు.వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే రాజోలు జలాశయం నిర్మించి కేసీ కాలువ ఆయకట్టు స్థిరీకరించి రైతులకు రెండుకార్లకు
సాగునీరు ఇచ్చేలా కృషిచేస్తామన్నారు. కేసీ కాలువకు సాగునీటి కోసం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో తామంతా కలిసి మైదుకూరు కూడలిలో ప్రతి ఏటా ధర్నాలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేపడితే గానీ కేసీ కాలువకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. శ్రీశైలంలో సాగునీరు
పూర్తిగా తగ్గిపోతోందన్నారు. ఈ ప్రాజెక్టును నమ్ముకుంటే రైతులకు కష్టమన్నారు. అందుకే రాజోలు నిర్మిస్తే అక్కడ 3 టీఎంసీలు నీరు నిల్వ ఉంచి రెండు కార్లకు రైతులకు నీరు అందించేందుకు, కాలువ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలుగుగంగ కాలువకు,
వెలుగోడు నుంచి 0నుంచి 18 నంబరు వరకు కాలువ బలహీనంగా ఉందన్నారు. దీని వల్ల జిల్లాకు నీరు తక్కువ వస్తోందని కాలువను ఆధునికీకరించమని నాలుగేళ్లుగా మంత్రిని కలిసి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు అనే గొప్ప పథకాలను
ప్రవేశపెట్టారని అన్నారు. ఆ పథకాలు అమలైతే ప్రతి పేద, బడుగు బలహీన వర్గాల వారందరికీ మేలు జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వేలు చేయాలని పరితపించిన వ్యక్తి మన వైఎస్సార్‌ అన్నారు. నేడు వైఎస్‌ జగన్‌ కూడా ప్రతి ఒక్కరికి వేలు చేయాలన్న పట్టుదలతో
ఉన్నారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంతోపాటు మన జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాజోలు

నిర్మించి కేసీ కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తామని, తెలుగు గంగకు 12 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని పేర్కొన్నారు. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను చొక్కా పట్టుకుని నిలదీయాలని కోరారు. చంద్రబాబు
ఎన్నికల ముందు 600 హావిూలు ఇచ్చి అందరిని మోసం చేశారన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని జగన్‌పై నిందలు వేయడం టీడీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.