రాణించిన టీమిండియా బౌలర్లు… తక్కువ స్కోరుకే పరిమితమైన శ్రీలంక

  • టీమిండియా-శ్రీలంక తొలి వన్డే
  • కొలంబోలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు

టీమిండియా బౌలర్లు రాణించడంతో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి వన్డేలో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. కొలంబోలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక… నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. అది కూడా లోయరార్డర్ రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.

టీమిండియా బౌలర్లు అద్భుతమైన క్రమశిక్షణతో బౌలింగ్ చేసి, లంకను కట్టడి చేశారు. అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 2, సిరాజ్ 1, శివమ్ దూబే 1, కుల్దీప్ యాదవ్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.

లోయరార్డర్ లో లంక బౌలర్ దునిత్ వెల్లలాగే పట్టుదలగా ఆడి 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. వెల్లలాగే 65 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. అతడికి జనిత్ లియనాగే (20), వనిందు హసరంగ (24), అఖిల ధనంజయ (17) నుంచి విశేష సహకారం లభించింది.

లంక టాపర్డార్ లో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 56 పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 1, కుశాల్ మెండిస్ 14, సదీర సమర విక్రమ 8, కెప్టెన్ చరిత అసలంక (14) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. అయితే, టాపార్డర్ విఫలమైనప్పటికీ… లోయరార్డర్ లో వెల్లలాగే ఇతర బ్యాట్స్ మెన్ అండతో జట్టు స్కోరును 200 మార్కు దాటించాడు.