రామాలయంపై చట్టం తెస్తే అభ్యతరం లేదు

బాబ్రీ మసీదు కక్షిదారు ఇక్బాల్‌ అన్సారీ

స్వాగతించిన ప్రధాన పూజారి

అయోధ్య,నవంబర్‌20(జ‌నంసాక్షి): దశాబ్దాలుగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి జరుగుతున్న

చర్చకు మంగళవారం మరింత బలం చేకూరింది. బాబ్రీ మసీదు కక్షిదారు ఇక్బాల్‌ అన్సారీ రామాలయ నిర్మాణానికి సంబంధించి సానుకూల వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి చట్టం తేవాలన్న డిమాండ్‌కు తన మద్దతు తెలిపారు. చట్టం తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, రామాలయం చుట్టూ ముసురుకున్న రాజకీయాలకు తెరపడాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. రామ మందిరం కోసం చట్టం తేవాలని ప్రభుత్వం కోరుకుంటే నాకెలాంటి సమస్యా లేదు. బీజేపీ ప్రభుత్వంతోనూ నాకు సమస్య లేదు. వారి పనితీరు సంతృప్తికరంగా ఉంది. రాజకీయ ప్రయోజనాలు అశించి ఇక్కడకు వస్తున్న రాజకీయనేతలతోనే అసలు సమస్య. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ ర్యాలీలు తీసేటప్పుడు అనుకోని ఘటనలు చోటుచేసుకుంటే వాళ్లు (రాజకీయనేతలు) ఏం చేయగలరు?’ అని అన్సారీ ప్రశ్నించారు.

రామ జన్మభూమి చుట్టూ రాజకీయాలు చోటుచేసుకోవడం వల్ల పెద్దఎత్తున జనం అయోధ్యకు చేరుకుంటే అది ముస్లింల వంటి మైనారిటీల భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుందని అన్నారీ అభిప్రాయపడ్డారు. ‘మెజారిటీ ఉన్న బీజేపీ ప్రభుత్వం రామాలయంపై నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు నమ్మకమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి’ అని అన్నారు. కాగా, ప్రభుత్వం చట్టం తీసుకువస్తే ఎలాంటి అభ్యంతరం లేదంటూ అన్సారీ చేసిన ప్రకటనను రామాలయం ప్రధాన పురోహితుడు స్వామి సత్యేంద్ర దాస్‌ స్వాగతించారు. ఇక్బాల్‌ అన్సారీ నిర్ణయం మెచ్చుకోలుగా ఉందని, రామాలయ నిర్మాణానికి చట్టం తీసుకువచ్చి, నిర్మాణం ప్రారంభించడానికి ఇదే తగిన సమయని ఆయన అన్నారీ. అన్సారీ తండ్రి హషిం అన్సారీ సైతం రాజీ కోరుకున్నారని, అయితే అది కార్యరూపం దాల్చలేదని స్వామి సత్యేంద్ర చెప్పారు.