రామాలయ నిర్మాణంలో బిజెపి విఫలం: శివసేన

ముంబై,నవంబర్‌19(జ‌నంసాక్షి): శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే కొత్త నినాదం ఎత్తుకున్నారు. ముందు ఆలయం.. ఆ తర్వాతే ప్రభుత్వం.. అని ఉద్ధవ్‌ థాకరే నినదించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే అయోధ్యలో రామాలయం నిర్మించాలని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఉద్ధవ్‌ థాకరే ప్రసంగించారు. నవంబర్‌ 24, 25 తేదీల్లో అయోధ్యలో పర్యటించనున్నట్లు పార్టీ చీఫ్‌ తెలిపారు. 2019లో ప్రభుత్వం ఏర్పడే కంటే ముందే అయోధ్యలో రామ్‌ మందిర్‌ నిర్మించాలని ప్రతి ఒక్క హిందువు డిమాండ్‌ చేయాలని థాకరే పిలుపునిచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించడంలో బీజేపీ విఫలమైందని ఆయన అన్నారు. నవంబర్‌ 24న థాకరే అయోధ్యలో సరయు పూజ నిర్వహించనున్నారు. ఆరోజున ప్రతి కార్యకర్త ఎక్కడికక్కడ తమ ప్రాంతాల్లో మహా పూజ చేయాలని థాకరే పిలుపునిచ్చారు.