రామ్‌లీలాకు వాజ్‌పేయ్‌ పేరు : ఢిల్లీ కార్పోరేషన్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి ): ఢిల్లీలో రామ్‌లీలా మైదానానికి దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలంటూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డీఎంసీ) ప్రతిపాదించింది.వాజ్‌పేయి దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 16న కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తమైంది. కాగా వాజ్‌పేయి గౌరవార్థం రామ్‌లీల మైదానానికి ఆయన పేరు పెట్టాలని భావిస్తున్నట్టు ఎన్‌డీఎంసీ వెల్లడించింది. ప్రతియేటా రామ్‌లీల ఉత్సవాలు జరిగే ఈ మైదానానికి విశేష ప్రాముఖ్యత ఉంది. లెక్కకు మిక్కిలి రాజకీయ సభలు, ర్యాలీలు, ఉత్సవాలు, వినోదకార్యక్రమాలకు ఈ మైదానం వేదికగా నిలిచింది. భారత 10వ ప్రధానమంత్రి వాజ్‌పేయి ఇక్కడికి వచ్చినప్పుడల్లా… ఆయన ప్రసంగాలు వినేందుకు జనాలు తండోపతండాలుగా వచ్చేవారు.