రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారు

బడ్జెట్‌లో కేటాయింపులే ఇందుకు నిదర్శనం

కడప,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రులు రాయలసీమ వాసులే అయినా వెనుక నుండి పాలించింది మాత్రం కోస్తా, తెలంగాణా వారేనని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి శివశంకర్‌ అన్నారు. అందుకే దశాబ్దాలుగా సీమ వెనకబడుతూ వచ్చిందని అన్నారు. దేశంలో రాయలసీమ అతంర్భాగం కాదా అని ప్రశ్నించారు. విభజన సందర్భంగా రాయలసీమకు కేటాయించిన ఎయిమ్స్‌, కేంద్ర విశ్వ విద్యాలయం, అమరావతిలో ఏర్పాటు చేసుకున్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. ఇది ముమ్మాటికీ రాయలసీమకు ద్రోహం చేసినట్టేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్జడెట్‌లో రాయలసీమ సమగ్రాభివృద్ధికి దోహదపడే చర్యలు లేవన్నారు. కనీసం లక్ష కోట్లు సీమకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా రాయలసీమ అభివృద్ధిలో దగాకు గురవుతుందని అన్నారు. బ్రిటీషు వారు అవసరాలకై 1954లో ఏర్పాటు చేసిన రైల్వేలైన్‌ తప్ప, మరే నిర్మాణం చేపట్టలేదని తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హావిూలను అమలు చేయాలంటే లక్ష కోట్లు కేటాయించాలని కోరారు. అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ వెనుకబాటుకు గురైందని విమర్శించారు. కేందప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఒరిగింది ఏవిూలేదని విమర్శించారు. రైతుల సంక్షేమం,అభివృద్ధి కోసం ఎన్నో ఆశలుపెట్టుకుంటే నిరాశపరిచినట్లు చెప్పారు.కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలం బడ్జెట్‌ రూపొందించారని చెప్పారు. పెద్దనోట్ల రద్దు వలన రూ.3 లక్షల కోట్లు ఖజానాకు చేరిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారన్నారు. బడ్జెట్‌లో ఏమేరకు ఖర్చుచేస్తారో వివరాలు వెల్లడించలేదన్నారు. ప్రజలను అంకెలగారడీతో మోసగిస్తున్నట్లు విమర్శించారు. ఆదాయం పన్ను పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి ఉంటే బాగుండేదన్నారు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు ఊతం ఇచ్చే నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు.