రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది

– ప్రజలను కాపాడేందుకే పీడీపీకి మద్దతిస్తున్నాం

– మా పొత్తు అపవిత్రం ఎలా అవుతుంది?

– గవర్నర్‌ చేస్తున్న ఆరోపణలను రుజువులు చూపించాలి

– జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌, నవంబర్‌22(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొందని, దీని నుండి ప్రజలను కాపాడేందుకే తాము పీడీపీకి మద్దతునిచ్చామని జమ్మూకాశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. జమ్ముకశ్మీర్‌ శాసనసభను రద్దుచేస్తూ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ బుధవారం రాత్రి సంచలన ప్రకటన చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన నిర్ణయం సరైనదేనని గవర్నర్‌ సమర్థించుకున్నారు. పీడీపీ-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అపవిత్రమైనది, సాధ్యం కాని కూటమి అని విమర్శించారు. అంతేగాక కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేయడం, నగదు చేతులు మారడం తదితర సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. కాగా.. గవర్నర్‌ వ్యాఖ్యలను నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. గవర్నర్‌ చేస్తున్న ఆరోపణలను

రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. తాజా పరిణామాలపై ఒమర్‌ అబ్దుల్లా గురువారం విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాకు న్యాయం జరగలేదని, నగదు చేతులు మారుతుంది, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు అని గవర్నర్‌ ఆరోపించారని, ఈ ఆరోపణలపై గవర్నర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు సాక్ష్యాలేంటో ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలని డిమాండ్‌ చేశారు. ఇక పీడీపీ-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అపవిత్ర కూటమి అని గవర్నర్‌ అన్నారని, భాజపా-పీడీపీ కూటమి అపవిత్రం కానప్పుడు మా పొత్తు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే భాజపా-పీడీపీ మధ్య కంటే నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌ మధ్యనే భేదాభిప్రాయాలు ఎక్కువ అని, స్వలాభం కోసం మేం చేతులు కలపలేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి నుంచి ప్రజలను కాపాడేందుకే పీడీపీకి మద్దతిస్తున్నామని ఒమర్‌ చెప్పుకొచ్చారు. రాజ్‌భవన్‌లో ఫ్యాక్స్‌ మిషన్‌ పనిచేయకపోవడం, దాని వల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతినడం ఇదే తొలిసారి అన్నారు. బహుశా అది వన్‌-వే ఫ్యాక్స్‌ మిషన్‌ అయి ఉంటుందని, ఇందులో నుంచి కేవలం ఫ్యాక్స్‌లను పంపించడమే కుదురుతుంది. బయటి నుంచి ఎలాంటి ఫ్యాక్స్‌లు రాకపోవచ్చు. దీనిపై దర్యాప్తు జరపాలని ఒమర్‌ విమర్శించారు.