రాష్ట్రాలే ఓబీసీలను గుర్తించాలి


` ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
` మద్ధతు తెలిపిన విపక్షాలు
దిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి): ఓబీసీలను గుర్తించే హక్కు తిరిగి రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ చట్టసవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. గతంలోనే ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. 127వ రాజ్యాంగ సవరణ బిల్లు `2021ను లోక్‌ సభలో ప్రవేశ పెట్టిన సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ మాట్లాడుతూ.. 671 కులాలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక చట్టంగా పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ పరిధిలోని ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించటం ద్వారా ఎన్నో కులాలకు సామాజిక, ఆర్థిక న్యాయం కలిగించవచ్చన్నారు. ఇందుకోసం అధికరణ 342ఏతో పాటు 338బీ, 366ను కూడా సవరించాల్సి ఉందని కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్‌ తెలిపారు. ఈ బిల్లుపై చర్చ ప్రారంభించిన కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఓబీసీ బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నట్టు చెప్పారు. 2018లో చేసిన 102 రాజ్యాంగ చట్ట సవరణను తప్పుబట్టిన ఆయన .. నాడు ప్రతిపక్షాలు చేసిన సూచన చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన ఓబీసీ బిల్లుకు వైకాపా మద్దతు తెలిపింది. ఓబీసీ కులాలను గుర్తించే హక్కును తిరిగి రాష్ట్రాలకు కట్టబెడుతూ రాజ్యాంగ చట్టసవరణ చేయడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్టు వైకాపా ఎంపీలు తెలిపారు. వెనుక బడిన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఆదినుంచి కట్టుబడి ఉందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. 3 దశాబ్దాల క్రితమే మండల్‌ కమిషన్‌ ప్రతిపాదించిన రిజర్వేషన్లు తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ స్వాగతించారని సభకు గుర్తు చేశారు.