రాష్ట్ర కొత్త సీఎంగా జైపాల్‌రెడ్డి ?
కేంద్రమంత్రిగా కిరణ్‌కుమార్ !
రాహూల్‌కు బెర్త్ ఖాయం.. రేణుకాకు చోటు
త్వరలో కేంద్రంలో పెనుమార్పులు
న్యూఢిల్లీ ,సెెప్టెంబర్ 15 (జనంసాక్షి):
వచ్చే వారం కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరగనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. 2014 లో సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న ఈ మంత్రివర్గ మార్పుల ఫలితంగా రాహుల్ గాంధి, మనీష్ తివారి కూడా కేంద్రం మంత్రిమండలిలోకి రాగలరని తెలుస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా మారుస్తారని ఢిల్లీలో ఊహాగానాలు వినవస్తున్నాయి. అటువం టి పరిణామాలు వాస్తవం అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డిని వరించవచ్చు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రంలోకి మంత్రిగా వెళ్లే అవకాశం ఉన్నట్టు ఈ ఊహాగానాలనుబట్టి తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధి కేంద్రంలో ఏదైనా ఒక పదవిని స్వీకరించాలని కొంతకాలంగా ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. అయితే
ఇటీవల వరకూ అందుకు ససేమిరా అంటుడే రాహుల్ ఈమధ్యే ఇందుకు సరేనంటూ సనుకూల సంకేతాలు పంపిస్తు న్నారు. అందువల్ల కేంద్ర మంత్రి మండలిలో ఈసారి జరిగే మార్పులు చేర్పులలో ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధి పేరు ఉంటుందని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. కేంద్రంలో మార్పులు అంటూ జరిగితే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మారుస్తారని అంటున్నారు. పనిలో పనిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా మార్చే అవకాశం ఉందని ఢిల్లీలో గట్టిగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అటువంటిదేమీ లేదని అటు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు, ఇటు జైపాల్ రెడ్డికి సన్నిహిత వర్గాలూ గట్టిగా చెబుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్‌ను ఢిల్లీ రావలసిందిగా ప్రధాని కార్యాలయంనుంచి, యు.పి.ఎ. అధ్యక్షురాలు సోనియా గాంధి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తున్నది. నరసింహన్ ఈ నెల 19వ తేదీన నరసింహన్ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరగనున్నట్టు ఢిల్లీలో ఊహాగానాలు ప్రారంభమైన కొంత సేపటికే గవర్నర్ ఢిల్లీ పర్యటన గురించిన సమాచారం వెలువడింది. దాంతో గవర్నర్ ఢిల్లీ యాత్రపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.