రాహుల్‌ గాంధీ సంచలన ప్రకటన

2019లో ప్రధానిని అవుతానేమో!

ప్రధాని పదవిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే తానే ప్రధాని అవుతానని అన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాహుల్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మీరే ప్రధాని పదవి చేపడతారా? అని అడిగిన ప్రశ్నకు.. అది పార్టీ విజయంపై ఆధారపడి ఉంటుందని, ఒకవేళ కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే తానే ప్రధాని అవుతానని సమాధానమిచ్చారు. అయితే గత నెలలో రాహుల్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో భాజపా విజయం సాధించదని, చివరకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన నియోజకవర్గమైన వారణాసి నుంచి ఓడిపోయే అవకాశముందని అనడం గమనార్హం. ప్రతిపక్షాలు ఒక్కటై భాజపాను ఓడిస్తాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే ప్రతిపక్షాలు ఏకమవ్వడంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ప్రధాని పదవి చేపట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని రాహుల్‌ను గతంలో అడిగిన ప్రశ్నకు కూడా ఆయన నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ భాజపాపై, మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భాజపాపై ధ్వజమెత్తడానికి ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. మోదీ ఎప్పుడూ ‘ఫ్లైట్‌ మోడ్‌’లోనే ఉంటున్నారని రాహుల్‌ తాజాగా విమర్శించిన సంగతి తెలిసిందే.