రిషికేశ్‌ తిరుమల ఆలయంలో నేటినుంచి పవిత్రోత్సవాలు

తిరుపతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రిషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్తోక్తంగా అంకురార్పణ జరిగింది. టిటిడి పరిధిలోని రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం నుండి సోమవారం వరకు మూడు రోజుల పాటు  పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన శనివారం సాయంత్రం 6.00 గంటలకు పవిత్ర ప్రతిష్ట, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో రోజు ఆదివారంఉదయం 8.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ, యాగశాల వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.00 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయి. చివరిరోజు సోమవారం ఉదయం 8.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం, రాత్రి మహాపూర్ణాహుతితో ముగియనున్నాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు.