రుణమాఫీ అందని రైతులను గుర్తించండి


వారికి అండగా నిలబడి అధికారులకు తెలపండి
సమాచారం తెలియచేసి నిలదీయండి
బిఆర్‌ఎస్‌ శ్రేణులకు మాజీమంత్రి వేముల పిలుపు
నిజామాబాద్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి): గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకునే రుణమాఫీ కాలేని రైతులకు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కడికక్కడ అండగా నిలవాలని, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. నేరుగా రైతులను గుర్తించి వారి వివరాలను అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. దరఖాస్తు చేసుకునే రైతులకు ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే స్థానికంగా ఉండే బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులను సంప్రదించాలని రైతులకు సూచించారు. రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ అయ్యేవరకు బీఆర్‌ఎస్‌ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఇకపోతే కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది నెలల క్రితం బూటకపు హావిూలతో అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే వేముల అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటి రైతులకు ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారని, రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా.. ఆ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల విూద ఒట్టు వేసి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని హావిూని మరిచిపోయారని అన్నారు. వందశాతం రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు.. సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరితే క్యాంపు
కార్యాలయంపై గుండాలను పంపించి దౌర్జన్యం చేయించారని మండిపడ్డారు. దానికి పోలీసులు వత్తాసు పలకడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారి పోయాయని అన్నారు. రాష్ట్రంలోని ఏ జిల్లాకు వెళ్లినా హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, దొంగతనాలు పెరిగిపోయాయని అన్నారు. సిద్దిపేటలో అర్ధరాత్రి జరిగిన సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బీఆర్‌ఎస్‌ నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన రుణమాఫీ హావిూని వంద శాతం అమలు చేసేలా బీఆర్‌ఎస్‌ పార్టీ రైతుల పక్షాన నిలుస్తుందని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా 30 నుంచి 40 శాతం వరకు కూడా రుణమాఫీ కాలేదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఏ సీఎం ప్రవేశపెట్టని రైతుబంధును కేసీఆర్‌ ప్రవేశపెడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రైతుబంధు పడలేదని అన్నారు. దేశంలో అతి తక్కువ కాలంలోనే సీఎం దిష్టిబొమ్మను దహనం చేసే వరకు దిగజారిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్‌ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మల శవయాత్ర చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రైతులకు రుణమాఫీ చేయాలని వేముల డిమాండ్‌ చేశారు