రూపాయికి శస్త్ర చికిత్స చేసేదెలా


దిగుమతుల భారం తగ్గిస్తేనే ఫలితం
రూపాయి బలహీనంతో భారంగా విదేశీ విద్య
ముంబై,ఆగస్టు16(జనంసాక్షి ): రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం 2014 ఆగస్టు 14న డాలర్‌కు 61.05 పైసలు. ఈ పదేళ్లలో అది ఇప్పుడు రూ.83 నుంచి 84 మద్యకి చేరుకుంది. ఇదొక్కటి చాలు మనమెంతగా ఆర్థికంగా చితికి పోయామో చెప్పడానికి. రూపాయి బలపడిరదంటే మన ఎగుమతులు పెరిగాయని అర్థం
చేసుకోవచ్చు. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు హరించుకు పోతున్నాయి. ఇదంతా కేవలం దిగుమతుల ప్రభావం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడీ సాధించిన ఆర్థిక ప్రగతి ఎలా ఉన్నా రూపాయిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. నిజంగా రూపాయికి శస్త్రచికిత్స చేసే కార్యాక్రమాలు కానరావడం లేదు. మనవాళ్లను అమెరికా పంపించాలంటేనే భయం వెన్నాడుతోంది. చదువుకునేందుకు వెళ్లే పిల్లలకు రూపాయలను బస్తాల్లో పంపినా అక్కడ పిడికెడు డాలర్లు రావడం లేదని వాపోతున్నారు. 78 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారిపోయి రూపాయి విలపిస్తుండగా, నిత్యావ సరాల ధరలు పెరిగి, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తీరు ఎక్కడా ప్రధాని మోడీ ప్రసంగంలో కానరావడం లేదు. 1947లో రూపాయి విలువ డాలర్‌తో సమానం. అంటే ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో మనం బాగా అభివృద్ది సాధించామని ఈ రకంగా పోల్చుకోవాలేమో. డాలర్‌తో రూపాయి మారకం దారుణంగా మారింది. అమెరికా, టర్కీల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో టర్కీ కరెన్సీ అయిన లిరా ఒడిదుడుకుల కు గురికావడంతోనే ఇంతటి పెను మార్పులని అప్పట్లో ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్‌ జైట్లీ సెలవిచ్చారు. అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఉపద్రవం వచ్చినా మన రూపాయి తట్టుకుని నిలబడేంత బలంగా లేదు. ఇంతటి బలహీనమైన రూపాయి ఎప్పుడు బలపడుతుందా అన్నదే అనుమానం. సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు వచ్చాక ద్రవ్యమారక రేట్లతో ప్రజా జీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన చమురు ధరలకు నిర్ణయాత్మకమవుతోంది. రూపాయి మారకం విలువ పడిపోతోందని 2014 ఎన్నికలకు ముందు మోడీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు మోడీ వికసిత భారత్‌ ప్రకటించారు. అయితే రూపాయికి శస్త్రచికిత్స చేయకుండా దీనిని సాధించడం దుస్సాధ్యం. ఇది సాధిస్తే ప్రజలు ఎవరికి వారు ఆర్థికంగా ఎదగలరు. ఎవరి ఆరోగ్యం వారు చూసుకోగలరు. దివంగత ప్రధాని పివి నరసింహారావు మాత్రమే ఇలాంటి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన తీసుకున్న సాహసోపేత సంస్కరణలే ఇప్పటికీ మనకు రక్షగా నిలిచాయి. ప్రధాని మోడీ ఇప్పుడు ఈ దిశగా దృష్టి సారించాలి. కఠిన పరిశ్రమ చేయాలి. పివి`మన్మోహన్‌ ద్వయం తెచ్చిన ఐఎంఎఫ్‌`ప్రపంచ బ్యాంకు ఆదేశిత ఆర్థిక విధానాలనే వాజ్‌పేయ్‌ ప్రభుత్వం అమలు చేసింది. అలాగే మన్మోహన్‌ సర్కారు బాటలోనే మోడీ ప్రభుత్వం నడుస్తోంది. కాబట్టి ఆ పార్టీలు పరస్పరం విమర్శించుకోవడం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప నిజంగా మాత్రం కాదు. రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగి రూపాయిని నిలబెట్టాల్సిఉందని చాలామంది సూచిస్తున్నారు. 80శాతం చమురు ఎలాగూ దిగుమతి చేసుకొనేదే కనుక, క్రూడాయిల్‌ ధర పెరిగి, దేశీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల రేట్లు మరింత హెచ్చి నిత్యావసర, వినియోగ వస్తువులు ఖరీదు కాక తప్పదు. ఉక్రెయిన్‌ యుద్దంతో చమురు లభ్యత మరింత తగ్గి కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందన్న ఆందోళనా ఉంది. ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి ఆర్‌బిఐ కష్టాలు పడుతున్న తరుణంలోనే రూపాయి మరింతగా కృశించి పోతున్నది. రూపాయిని కాపాడటానికి రిజర్వుబ్యాంకు వద్ద అనేక మార్గాలు ఉండివుంటాయని, తగిన సమయంలో నిర్ణయాలు చేస్తుందని ఆర్థిక నిపుణులు హావిూ ఇస్తున్నప్పటికీ, ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుందన్నది అర్థంకాని ప్రశ్న. రిజర్వుబ్యాంకు చర్యలు సామాన్యుడికి ఉపశమనం ఇవ్వలేని కాలం కూడా దాపురించవచ్చు. రూపాయి బలహీనతలను గుర్తించి తగు శస్త్ర చికిత్సలకు దిగాలి. లేకుంటే ఆర్థిక ద్రవ్యోల్బణం,ధరల స్వారీ పెరగగలదు. పెద్దనోట్ల రద్దు వంటిచర్యల కారణంగానే ఆర్థిక సంక్షోభం ఉత్పన్న మైందన్న వాదన ఇప్పటికీ ఉంది. ఎందుకంటే ఆనాటి నుంచి నేటి వరకు ఆర్థికరంగం తిరోమనంలోనే ఉంది. తన అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ మోదీ ప్రభుత్వం రిజర్వుబ్యాంకును నోరులేని దానిగా మార్చి
వేసిందని విపక్షాలు అంటున్నాయి. ఆర్థిక రంగంలో కొత్త ఉత్పాతాలను తట్టుకొని నిలబడగల స్థితిలో ప్రజలు లేరు. ద్రవ్యోల్బణం అదుపు తప్పితే మరిన్ని కష్టాలు తప్పవు. బ్యాంకు వడ్డీరేట్లు పెరగడం, రుణాలవిూద ప్రభావం వంటి సమస్యలు కూడా అనేకం. రూపాయి పతనమవుతున్నందున పెట్టుబడిదారులు డాలర్‌ సురక్షిత మైనదిగా భావించడంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా తరిగి పోతున్నాయి. డాలర్‌ విలువ కారణంగా వాణిజ్యలోటు హెచ్చుతూ ఐదేళ్ళ గరిష్టానికి చేరింది. రూపాయి విలువ తగ్గుదలతో ఎగుమతులకు మేలు జరగవచ్చని కొందరంటున్నారు. అయితే ఇప్పటికే అమెరికా, ఐరోపా మార్కెట్లలో విధించిన నిబంధనలవల్ల వాటికి ముప్పు ఏర్పడిన వాస్తవాన్ని విస్మరించరాదు. అంతేగాక దిగుమతుల భారం వల్ల ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాన్ని గుర్తించాలి. డాలర్లు మన దేశం నుంచి తరలి పోకుండా పరిమితం చేయడానికి విలాస వస్తువుల విచ్చలవిడి దిగుమతులపై ఆంక్షలు విధించడం అవసరం అన్న భావనా ఉంది. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఆర్థిక విధానాల వైపు ఇప్పటికైనా మళ్లాల్సి ఉంది.భారతీయ రిజర్వుబ్యాంకు జోక్యం పూర్తిస్థాయిలో లేనందునే రూపాయి ఇంతగా ఉన్నదని కొందరి వాదన. రూపాయి పతనం ఐటీ, ఎగుమతులు ఇత్యాది రంగాలకు మేలుచేస్తుందని అంటున్నారు కానీ, సామాన్యుడిపై ధరాఘాతం తప్పడం లేదు. దిగుమతి చేసుకొనే ఉత్పత్తుల ధరలు పెరిగిపోతున్నాయి. ఎగుమతులు, దిగుమతులను విశ్లేషించాలి. తాము తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితం ఇవ్వడం లేదని గుర్తించి అందుకు కారణాలు విశ్లేషించాలి. చమురు దిగుమతులే మన కొంప ముంచుతు న్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెరిగిన చమురు ధరల కారణంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరగి పోతున్నాయి. అంతేగాకుండా రూపాయి మారకవిలువ దిగజారిపోతోందని అంటున్నారు.