రెండోదశలో 72స్థానాల్లో పోలింగ్‌

ఓటుహక్కు వినియోగించుకున్న అజిత్‌ జోగి

రాయ్‌పూర్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలోని 72చోట్ల జరుగుతున్న పోలింగ్‌లో 1079 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం పది గంటల సమయానికి 12.54శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం అయినందున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు లక్ష మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్‌లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ పార్టీ అధినేత అజిత్‌ జోగి, ఆయన కుమారుడు అమిత్‌ జోగి పెంద్రా ప్రాంతంలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. ఎన్నికల్లో బీఎస్పీ, మాజీ సీఎం అజిత్‌ జోగి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌, సీపీఐ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. భాజపా నాలుగోసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. 90స్థానాల్లో 65సీట్లలో గెలవాలని ప్రయత్నిస్తోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. నవంబరు 12న జరిగిన తొలి దశ పోలింగ్‌లో 76శాతం ఓటింగ్‌ నమోదైంది. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.