రేగులతండా గ్రామ పంచాయతీని ప్రారంభించిన ఎర్రబెల్లి
జనగామ,ఆగస్ట్8(జనం సాక్షి): రైతుబీమాతో అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలిచిందని పాలకుర్తి ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం కొడకండ్ల మండలంలో ఆయన పర్యటించారు. నూతనంగా ఏర్పడిన రేగులతండా గ్రామ పంచాయతీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆ గ్రామంలో మొక్కలు నాటారు. రైతు బాండ్లతో పాటు కల్యాణలక్ష్మి చెక్కులను, పట్టాదారు పాసు పుస్తకాలను లబ్దిదారులకు ఆయన అందజేశారు. రైతు సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కెసిఆర్‌ను విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైతం టిఆర్‌ఎస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.