రేపు హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం(సెప్టెంబర్-23) ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కి.మీ. మార్గంలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ సమాచారం తెలుసుకోవచ్చన్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులు, లారీలు ఔటర్ మీదుగా రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఊరేగింపు మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుందని తెలిపారు. ప్రైవేటు బస్సులకు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు నగరంలోకి ప్రవేశం లేదన్నారు.
ఆదివారం వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 29 డిపోల నుంచి బస్సులు నడుస్తాయని… బస్సుల ఆపరేషన్స్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 33మంది ఆఫీసర్లను, 40 మంది సూపర్‌వైజర్లను, 70 మంది మెకానిక్‌లను, 100 మంది డ్రైవర్లు, 50 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పనిచేస్తారని ఆయన తెలిపారు.