రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ దాడులు
– ఏకకాలంలో 11మంది సభ్యుల బృందంతో 15చోట్ల దాడులు
– హైదరాబాద్‌లోని రేవంత్, అతని బంధువుల ఇండ్లలోనూ సోదాలు
– తాళాలు పగులగొట్టి రేవంత్ నివాసంలోకి వెళ్లిన బృందం సభ్యులు
– రేవంత్‌కు ఫోన్ చేసి రావాలని ఐటీ అధికారుల ఆదేశం
– ప్రచారంలో ఉన్నా.. సాయంత్రం వరకు వస్తానన్న రేవంత్
– దాడుల విషయం తెలిసి రేవంత్ ఇంటికి చేరుకున్న ఉత్తమ్, జానా
– లోపలికి అనుమతించని ఐటీ అధికారులు
– రేవంత్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు
– రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు – ఉత్తమ్
– భయపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారు – జానారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 27(జనంసాక్షి) : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. గురువారం ఉదయం రేవంత్ నివాసాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులకు దిగారు. వీరంతా బెంగళూరు నుంచి వచ్చినట్లు తెలిసింది. ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసం, ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 11మంది సభ్యులతో కూడిన బృందం ఏకకాలంలో 15 ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. కాగా హైదరాబాద్‌లోని రేవంత్ నివాసంలో వద్దకు వెళ్లిన ఐటీ అధికారులకు తాళాలు వేసి ఉన్నాయి. బుధవారం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి నేరుగా కొడంగల్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం పనివారు తప్ప కుటుంబసభ్యులెవరూ లేరు. దీంతో పనిమనుషులు ఉండటంతో వారిని తాళం తీయాలని ఆదేశించారు. దీంతో తమ సార్‌కు ఫోన్ చేయాలని, ఆయన అనుమతి ఉంటేనే తాళం తీస్తామని చెప్పడంతో.. ఐటీ అధికారులు బలవతంగా తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. తనిఖీల సమయంలోనే రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసిన ఐటీ అధికారులు వెంటనే కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకోవాలని ఆదేశించారు. దీనికి స్పందించిన రేవంత్‌రెడ్డి తాను హైదరాబాద్‌లో లేనని కొడంగల్ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నానని మధ్యాహ్నం సమయం కల్లా వస్తానని సమాధానం ఇచ్చారు. వెంటనే రావటానికి వీలు పడదని సమయం పడుతుందన్నారు. దీంతో ఐటీ అధికారులు తమ సోదాలను కొనసాగించారు. మరోవైపు రేవంత్ బంధువుల
ఇండ్లలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కుటుంబ సభ్యుల ఫోన్‌లను స్వీచ్‌ఆఫ్ చేయించారు. ఎవరిని బయటకు వెళ్లకుండా ఆదేశించారు. మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు, అతని భార్యను అధికారులు ప్రశ్నించారు. పలు విషయాలపై వారి నుండి ఆరాలు తీశారు. ఇదిలాఉంటే తన రియల్ ఎస్టేట్ సంస్థను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి కొద్దిరోజుల క్రితమే వ్యాఖ్యానించారు. తనను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపై కుట్రలకు తెరతీస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.
కొడంగల్ ప్రచారంలో రేవంత్..
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కొడంగల్ నుంచి పోటీకి దిగుతున్న రేవంత్ రెడ్డి గురువారం ప్రచారాన్ని ప్రారంభించేందుకు కొడంగల్‌కు వెళ్లారు. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం మదన్ పల్లిలో రేవంత్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తమ గ్రామానికి వచ్చిన రేవంత్ కు ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి. అక్కడి నుండి భారీ ర్యాలీగా మదన్ పల్లి నుంచి, బురాన్ పూర్, బొంరాస్ పేట విూదుగా మహబూబ్ నగర్ జిల్లా కొస్గి మండలం పోలేపల్లి వరకూ సాగింది. కాగా రేవంత్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని, ప్రశాంతంగా ఉన్నారని, తన పంథా ప్రకారమే ప్రచారంలో పాల్గొన్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు..
రేవంత్ నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్‌రెడ్డి అబిమానులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌లోని రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కావాలనే దాడులు చేయిస్తుంని ఆరోపిస్తూ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు రేవంత్ ఇంటి వద్దకు చేరుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఐటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించక పోవటంతో అక్కడే బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు – ఉత్తమ్
రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో పాత కేసులతో కాంగ్రెస్ నేతలను అణగదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు తెరాస చేతకానితనానికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. ప్రగతిభవన్‌లో ఐటీ సోదాలు చేస్తే వందల కోట్లు దొరుకుతాయని ఆయన అన్నారు. దేశంలోనే కేసీఆర్ కుటుంబం అత్యంత అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం కాంట్రాక్టర్ల నుంచి 6శాతం కవిూషన్లు దండుకుందన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ విపక్షాలపై అణిచివేత కుట్రకు పాల్పడుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కేంద్ర సంస్థలతో తనిఖీలు చేయిస్తూ తమకు సంబంధం లేదని అధికారపార్టీ నేతలు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బెదిరిస్తే బెదిరేది లేదని.. ప్రతి పౌరుడు తిరగబాటు చేస్తారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకులకు జైల్‌లు కొత్తేవిూకాదు – షబ్బీర్ అలీ
కాంగ్రెస్ నాయకులకు జైల్‌లు, వేధింపులు కొత్తేవిూ కాదని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నాయకులను హారస్ చేస్తున్నారని మండిపడ్డారు. పాత కేసులను బయటకు తీసి కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. పాత కేసులో భాగంగా రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని అనుకుంటున్నారు.. కాంగ్రెస్ నాయకులకు వేధింపులు, జైలులు కొత్త కాదు అని అన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం కాంగ్రెస్ నాయకులు జైలకు వెళ్లిన చరిత్ర మాకు ఉంది అని ఆయన పేరొన్నారు.
భయపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారు – జానారెడ్డి
రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కేసీఆర్, మోదీ ప్రజాహక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. నియంతృత్వ ధోరణితో పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. అందరినీ భయపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. ఓటుతో ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని.. పనిచేసే పార్టీలకు పట్టం కట్టండని జానారెడ్డి పిలుపునిచ్చారు.