*రైతాంగ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉదృతం చేసాం…
ఎరువులు, విత్తనాలు,
పురుగు మందులపై జిఎస్టి ఎత్తివేయాలి…
ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పెద్దారపు రమేష్…
వరంగల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద రైతులతో కలిసి ఆందోళన
ఫోటో రైటప్: కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందిస్తున్న రైతు సంఘం నాయకులు…
వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 1 (జనం సాక్షి)
పెరిగిన ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఎరువులు విత్తనాలు పురుగుమందులు వ్యవసాయ పరికరాలపై జిఎస్టి ఎత్తివేయాలని, ప్రస్తుత వ్యవసాయ సీజన్ లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి తక్షణమే ఆదుకోవాలని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
గురువారం వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఆందోళన నిర్వహించి జిల్లా అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దార రమేష్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
అఖిలభారత రైతు సమైక్య (ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక వరంగల్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఆందోళన నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కోట శ్రీవాత్సవ గారికి వినతి పత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన పంటలతో అన్నం పెడుతున్న అన్నదాతలకు ప్రభుత్వ విధానాలు ఒకవైపు ప్రకృతి మరొకవైపు చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు రైతు రాజ్యం అని చెప్పుకుంటూనే రైతుల్ని వ్యవసాయం నుంచి దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఈ క్రమంలో కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్సైట్ పేరుతో రైతుల భూములను ప్రభుత్వ రికార్డులు కనిపించకుండా చేసిందని లక్ష రూపాయల రుణమాఫీ అంటూ ఇంతవరకు అమలు చేయలేదని రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించకుండా దళారుల రాజ్యాన్ని నడిపిస్తున్నారని పెరిగిన ఎరువులు పురుగు మందులు విత్తనాలు ధరలతో అందని బ్యాంకు రుణాలతో రైతాంగం అనేకవస్థలు పడుతూనే పంటలు పండిస్తున్నారని ఈ క్రమంలో ములుగే నక్క తాటికాయ పడ్డ చందంగా ప్రకృతి సైతం కన్నీరు చేసి అధిక వర్షాలు పడటంతో పంటల దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్థితి మరింత ఆగమ్య గోచరంగా తయారయింది అన్నారు.
అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుల్ని ఆదుకునే విధంగా వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి ఆందోళన చేపడుతామని అందులో భాగంగా సెప్టెంబర్ 21న చలో ఇందిరా పార్క్ కు పిలుపునిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐకెఎఫ్ జిల్లా కార్యదర్శి కుసుంబ బాబూరావు ఎంసీపిఐయు నగర కార్యదర్శి గడ్డం నాగార్జున రాష్ట్ర కమిటీ సభ్యులు నర్ర ప్రతాప్ మంద రవి నాగేల్లి కొమురయ్య నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్ రైతు సంఘం జిల్లా నాయకులు గోరంటాల శరత్ బాబు గాజుల వెంకటయ్య అప్పనపురి నర్సయ్య రాయినేని ఐలయ్య జటబోయిన నరసయ్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.