రైతులకు ఆర్‌బీఐ కానుక
రూ. 1.6 లక్షల వరకు హామీ లేకుండా వ్యవసాయ రుణాలు
ముంబయి: రైతుల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో సరికొత్త పథకం తీసుకొచ్చారు. పేద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 అందజేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా రైతులకు మరో కానుక అందిస్తోంది. హామీ అవసరం లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 1.60లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాల అంశాన్ని ప్రస్తావించింది. ‘ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6లక్షల వరకు పెంచుతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ఆర్‌బీఐ పేర్కొంది. దీనిపై త్వరలోనే అన్ని బ్యాంకులకు నోటీసు జారీ చేయనుంది. హామీ రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ. లక్ష వరకు పెంచుతూ 2010లో ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.