రైతులకు మద్ధతిస్తున్న సెలబ్రిటీలపై కేంద్రం గుస్సా..
దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాలను ట్విటర్ పునరుద్ధరించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే సామాజిక మాధ్యమ సంస్థపై చర్యలు తప్పవని హెచ్చరించింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై కొందరు సోషల్‌విూడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖ గత సోమవారం పేర్కొంది. అలా తప్పుడు సమాచారం చేరవేసే ఖాతాలను నిలిపివేయాలని, ఆ ట్వీట్లను వెంటనే తొలగించాలని ట్విటర్‌ను ఆదేశించింది. దీంతో దాదాపు 100 ఖాతాలను నిలిపివేసింది. 150 ట్వీట్లను తొలగించింది. వీటిలో కిసాన్ ఏక్ మోర్చా, బీకేయూ ఖాతాలు కూడా ఉన్నాయి.అయితే కొన్ని గంటల తర్వాత బ్లాక్ చేసిన అకౌంట్లను/ట్వీట్లను ట్విటర్ పునరుద్ధరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రభుత్వ అనుమతి లేకుండానే ట్విటర్ ఏకపక్షంగా ఖాతాలను పునరుద్ధరించింది. ట్విటర్ ఒక మాధ్యమం మాత్రమే. సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేసింది. ఖాతాల స్తంభనపై ఆదేశాలు పాటించనుందుకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రైతుల ఆందోళనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌విూడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వం ట్విటర్‌కు ఈ ఆదేశాలు జారీ చేసింది.