రైతు ఉద్యమానికి మాజీ సైనికుల మద్ధతు
– దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడతాం: టికాయత్
కర్నల్ (హరియాణా),ఫిబ్రవరి 14(జనంసాక్షి):కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తాము మద్ధతు పలుకుతున్నట్లు మాజీ సైనికులు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడతామని, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు తాము విశ్రమించబోమని, ప్రభుత్వాన్ని కూడా ప్రశాంతంగా ఉండనీయబోమన్నారు. హరియాణాలోని కర్నల్ జిల్లాలో నిర్వహించిన మహా పంచాయత్ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఊరుకునేది లేదని టికాయత్ అన్నారు. రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న 40 మంది రైతు నేతలంతా కలిసి దేశవ్యాప్తంగా పర్యటించి మద్దతు కూడగడతామని చెప్పారు. వ్యవసాయ చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. ఈ చట్టాలు కేవలం రైతులపైనే కాక చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, ఇతరులపైనా ప్రభావం చూపుతాయని అన్నారు. ”ముందు గోదాములు నిర్మించారు.. తర్వాత చట్టాలు వచ్చాయి. ఇవి బడా కార్పొరేట్లకు మేలు చేసేవని రైతులకు ఆమాత్రం తెలీదనుకుంటున్నారా? ఈ దేశంలో ఆకలిపై వ్యాపారం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోం” అని టికాయత్ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నేతలు బల్బీర్‌సింగ్ రాజేవాల్, దర్శన్‌పాల్, గుర్నామ్ సింగ్ చదౌనీ పాల్గొన్నారు.