రైతు సమస్యలపై అవగాహనా లోపం

నగదు బదిలీతో సమస్యలు యధాతథం

లోతైన ఆలోచన చేయని కేంద్రం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): దేశంలో రైతులకు సంబంధించిన సమస్యలు అనేకానేకం ఉన్నాయి. ప్రధానంగా నీటి సౌలభ్యం, విద్యుత్‌,విత్తనాలు అందించడం…పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయడం.. ప్రకృతి వైపరీత్యాలు వస్తే తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం ముఖ్యం. పంట నష్టపోతే పరిహారం చెల్లించేలా బీమా ప్రతిపాదనలు ఉండాలి. కవరువ సమయంలో పంటలు పండకున్నా, పశువులకు మేత తదితర విషయాల్లో ఆదుకునేలా పథకాలు ఉండాలి. రైతుకు సంబంధించినంత వరకు ఇవి ప్రధాన సమస్యలు. ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ధాన్యం కొనుగోళ్ల కోసం మార్కెట్ల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. తడిసిన పంటలను కొనుగోలు చేస్తారన్న ధైర్యం దక్కడం లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే నిరంతర విద్యుత్‌ ఇస్తూ సాగునీటి కల్పనకు విశేష కృషి చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు నాలుగు వేలు అందించారు. అలాగే తడిసిన ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నాలు జరిగాయి. పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం జరిగింది. ఇలాంటి ప్రయత్నాలు చేసుకునేలా కేంద్రం రాష్ట్రాలకు తోడ్పాటు ఇవ్వాలి తప్ప తాయిలాలు ప్రకటించడం ద్వారా రైతుల సమస్యలు తీరవు. ప్రధాన్‌మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 అందించేలా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనివల్ల దాదాపు 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఖజానాపై రూ.75వేల కోట్ల భారం పడుతుంది. రుణాలు రద్దు చేయడం కన్నా.. రైతులకు నేరుగా నగదు అందించడం మంచిదే అయినా..

చాలామంది ఊహించిన విధంగా ఈ పథకం ఆకర్షణీయంగా లేదు. ఆశించిన దానికంటే ఈ ప్యాకేజీ చిన్నదే. పథకాన్ని అమలు చేయడం ప్రకటించినంత సులభం కాదు. సరైన భూమి రికార్డులు లభించడం పెద్ద సవాలు. దేశంలోని శ్రామికుల్లో సగానికి పైగా వ్యవసాయ రంగంపైనే జీవిస్తున్నారు. స్థూల దేశయోత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా నానాటికీ తీసికట్టుగా ఉంది. ఇలా డబ్బుఉల ఇస్తామని కాకుండా వ్యవసాయ రంగ కష్టాలను తొలగించడానికి, ఉపాధి పెంచడానికి బడ్జెట్‌లో కొన్నైనా చర్యలు ప్రకటించి ఉంటే బాగుండేది.

దేశవ్యాప్తంగా అసంతృప్తితో ఉన్న రైతులను ఎన్నికల వేళ బుజ్జగించడానికి మోదీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. రాజధాని ఢిల్లీలో ఇటీవలి కాలంలో అనేక రైతు ఉద్యమాలు సాగాయి. వాటిపై ఏనాడూ మోడీ సర్కార్‌ దృష్టి పెట్టలేదు. దీనిని గమనించే పథకం ప్రవేశ పెట్టినా ఇది రైతులను గట్టెక్కిస్తాదనుకోవడం భ్రమే కాగలదు. ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి ఆరువేల రూపాయల నగదును నేరుగా వారి ఖాతాల్లో వేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌గోయల్‌ బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ పథకం ద్వారా దాదాపు పన్నెండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనివల్ల ఖజానాపై రూ.75 వేల కోట్ల భారం పడనున్నది.ఈ ఏడాది నుంచే పథకాన్ని అమలుచేయనున్నారు. ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.86,602 కోట్లుకేటాయించగా.. ఈసారి రూ. 63, 379 కోట్లు ఎక్కువ. ఎరువులపై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని మాత్రం తగ్గించారు. రూ. 74,986 కోట్లను రూ.70,075 కోట్లకు పరిమితంచేశారు. వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుంచి రైతులను కాపాడటంకోసమే ఈ పథకమని పీయూష్‌గోయల్‌ వివరించారు. వ్యవసాయ అనుబంధరంగాలైన పశుపోషణ, మత్స్యపరిశ్రమ రైతులకూ ఆర్థికమంత్రి ఊరట కల్పించారు. వీరికి గత బడ్జెట్‌ నుంచి కిసాన్‌ క్రెడిట్‌కార్డులు అందించారు. ఈకార్డుల ద్వారా రుణాలు పొందిన రైతులకు రెండుశాతం వడ్డీరాయితీని ప్రకటించారు. అంతేకాకుండా, రైతులు తాము తీసుకొన్న రుణాలను సకాలంలో చెల్లిస్తే అదనంగా మరో మూడు శాతం వడ్డీ రాయితీని ప్రకటించారు. ప్రకృతి విపత్తుల కారణంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయ కార్యక్రమాలు నిర్వహించిన ప్రాంతాల్లోని రైతులకు పంటరుణాలపై 2 శాతం వడ్డీ రాయితీతోపాటు మూడుశాతం సకాలంలో రుణాల చెల్లింపు ఇన్సెంటివ్‌ను కూడా ఇస్తారు. దీంతోపాటు గోవుల ఉత్పత్తి, సుస్థిర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, చట్టాల అమలు పర్యవేక్షణకు రాష్టీయ్ర కామధేను ఆయోగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. మత్స్యశాఖకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు పీయూష్‌గోయల్‌ తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేసేందుకు 22 రకాల పంటలపై కనీస మద్దతుధరను ఉత్పత్తి వ్యయం కంటే 50శాతం పెంచామని మంత్రి పేర్కొన్నారు. పంటల ధరలు పడిపోవడం వల్ల రైతులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని.. ఈ పరిస్థితి నుంచి రైతులను బయటపడేసేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని గోయల్‌ తెలిపారు.