రైల్లో యువతిపై అత్యాచార యత్నం
మైసూర్: వేగంగా వెళుతున్న రైలులో తనపై అఘాయిత్యం జరపబోయిన నలుగురు పురుషులను తీవ్రంగా ప్రతిఘటించిన ఒక 19ఏళ్ళ యువతి ఆ దుండగులు రైల్లో నుంచి బలంగా వెలుపలికి తోసేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యశ్వంత్‌పూర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంగళవారం ఈదుర్ఘటన జరిగింది. ఇక్కడికి సుమారు 63కిలోమీటర్ల దూరంలోని మద్దూర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. 25అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఆ యువతి తలకు బలమైన గాయాలు తగిలాయి. వెన్నెముక, కాళ్లకు తీవ్ర గాయాలైనాయి. ఆమె ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.
రైలులో ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించిన నలుగురు దుండగులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బెంగళూరులోని ఒక దుస్తుల కర్మాగారంలో టైలరుగా పని చేస్తున్న ఆ యువతి తన సొంతూరు అయిన మైసూరుకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.